జగన్ కొత్త పార్టీ స్థాపిస్తే పీఆర్పీ దుకాణం ఖాళీ..!?

FILE
వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కాంగ్రెస్ హైకమాండ్‌కు మధ్య దూరం రాను రాను పెరుగుతోంది. జగన్ పట్ల అధిష్ఠానం కఠిన వైఖరి ప్రదర్శిస్తుండటంతో ఆయన ఏ క్షణమైనా సొంత కుంపటి పెట్టే అవకాశం లేకపోలేదన్న అనుమానాలు రోజురోజుకీ బలపడుతున్నాయి. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ జగన్ పార్టీ పెడితే ఎంతమంది ఆయన వెంట నడుస్తారన్న దానిపై రహస్య నివేదికను తెప్పించుకున్నట్లు సమాచారం.

ఈ నివేదిక వివరాలను చూసి హైకమాండ్ ఖంగు తిన్నట్లు భోగట్టా. దానికి కారణం.. జగన్ కొత్త పార్టీ స్థాపిస్తే ఆయన వెంట సుమారు 40మంది ఎమ్మెల్యేలకు తగ్గకుండా ఉంటారని తేలడమే. కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు మంత్రులతో సహా దాదాపు 20 మంది జగన్ గూటికే వెళతారని తెలుస్తోంది.

ఇక ప్రభుత్వం కూలిపోతే ఆపన్నహస్తం అందిస్తామని చెపుతున్న ప్రజారాజ్యం పార్టీ నుంచి దాదాపు డజను మంది ఎమ్మెల్యేలు జగన్ వైపు క్యూ కట్టే అవకాశాలున్నట్లు ఆ రహస్య జాబితా వెల్లడించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి బద్ధ శత్రువుగా ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి హీనపక్షం అరడజను మంది ఎమ్మెల్యేలు తమ పసుపు జెండాలను వదిలి జగన్ శిబిరంలో చేరే అవకాశాలున్నట్లు అధిష్టానం వద్ద పక్కా సమాచారం ఉన్నట్లు భోగట్టా.

ఈ పరిస్థితుల్లో జగన్ పట్ల ఎలా వ్యవహరించాలన్నదానిపై కాంగ్రెస్ హైకమాండ్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఏదేమైనా సెప్టెంబరు 3 తర్వాత అసలు సంగతి ఏమిటో తేలుతుంది.

వెబ్దునియా పై చదవండి