జగన్ నుంచి దృష్టి మళ్లించడమే అధిష్టానం ఏకైక అజెండా!!

మంగళవారం, 28 డిశెంబరు 2010 (10:20 IST)
కాంగ్రెస్ మాజీ యువనేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అధిష్టానం భయపడుతోందా? జగన్ గాలిని ఎలా బ్రేకులు వేయాలో తెలియక తలలు పట్టుకుంటోందా? రైతు సమస్యలపై సమరశంఖం పూరించిన తెలుగుదేశం పార్టీని ఏ విధంగా ఇరుకున పెట్టాలని భావిస్తుందా? తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏరీతిలో వెనక్కి నెట్టి ఆ క్రెడిట్ తమ సొంతం చేసుకోవాలని తహతహలాడుతోందా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ నేతల నుంచి స్పష్టమైన సమాధానం లభించడం లేదు. కానీ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు మాత్రం పై ప్రశ్నలకు 'ఎస్' అనే సమాధానం చెపుతున్నారు.

అందుకే 'టెన్ జన్‌పథ్' పక్కా ప్రణాళికను రూపొందించింది. సొంత పార్టీకి చెందిన ఎంపీలనే రోడ్లపైకి పంపేలా చేసింది. అధిష్టానం మాటను కలలో కూడా జవదాటని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలతో రాజకీయ క్రీడకు తెరలేపింది. సొంత పార్టీ ప్రభుత్వం మీదికే సమరానికి కాలుదువ్వేలా ప్రోత్సహించింది. అవసరమైతే ప్రభుత్వాలను కూల్చి వేస్తామంటూ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేయించేలా చేసింది. నిన్నమొన్నటి వరకు గుప్‌చిప్‌గా ఉన్న ఈ ఎంపీలు రాత్రికిరాత్రి వీధిన పడటంలో ఆంతర్యమేమిటి? ఇది దేనికి సంకేతం?

విద్యార్థులు కేసుల ఎత్తివేతపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు చేపట్టిన దీక్షపై పలు రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉంటూ.. డిమాండ్ల సాధనకు దీక్షకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఈ దీక్ష ద్వారా అనేక ఫలితాలు సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో పార్టీకి నష్టం జరుగుతుందని కొందరు వాదిస్తుండగా... మరికొందరు దీనిని తోసిపుచ్చుతున్నారు.

ప్రధానంగా.. తెలంగాణ వచ్చనా రాకపోయినా... జగన్ వల్ల జరుగనున్న నష్టాన్ని అడ్డుకునేందుకే కాంగ్రెస్ అధిష్టానం ఈ తరహా ఆందోళనకు ప్రోత్సహించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు.. తెలంగాణ ప్రాంతంలో కొంత స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఈ దీక్ష కదలిక తెచ్చేలా చేసింది. అలాలగే, తెరాస, తెదేపాలను ఇరుకున పెట్టేలా చేసింది. పైపెచ్చు.. తమ మాటలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారనే సంకేతాలను ప్రజల్లోకి పంపేలా చేసేందుకు తెలంగాణ ఎంపీలు తమ దీక్ష ద్వారా చేశారు.

దీంతో పాటు.. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అగ్రపథంలో ఉన్న తెరాసను వెనక్కి నెట్టేందుకు, రైతు సమస్యల అజెండాతో ముందుకు దూసుకెళ్తున్న తెదేపాను అడ్డుకునేందుకే అధిష్టానం వ్యూహాత్మకంగానే ఎంపీలతో పోరుబాట పట్టించినట్టు అభిప్రాయపడుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వస్తున్న నేపథ్యంలో... ఇప్పటికిప్పుడు తెలంగాణలో గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి కాంగ్రెస్ నేతలకు ఉంది. ఈ పరిస్థితి మారాలంటే పోరాడక తప్పదంటున్నారు. వీటితో పాటు... పక్కలోబల్లెంలా తయారైన జగన్‌కు చెక్ పెట్టాలంటే ఇలాంటివి చేయించాలన్నది అధిష్టానం వ్యూహంగా ఉంది.

ప్రస్తుతం తెలంగాణ నేతలతో చేయించిన హైకమాండ్.. తదుపరి సీమాంధ్ర నేతలను పురిగొల్పే అవకాశాలు లేకపోలేదన్నారు. అవసరమైతే వచ్చే యేడాది నుంచి స్వయంగా రాహుల్ గాంధీని ఆంధ్రప్రదేశ్‌లో సుడిగాలి పర్యటనలు చేయించేలా రూపకల్పన చేస్తోంది. అయితే, అధిష్టానం చేస్తున్న ఈ చర్యల వల్ల పార్టీకి కొంతమేరకు నష్టం వాటిల్లే అవకాశాలు లేకపోలేదనే వాదనలూ వినొస్తున్నాయి.

వెబ్దునియా పై చదవండి