హరికృష్ణ 'ప్రజా చైతన్య రథయాత్ర' vs బాబు 'తెలుగు ఆత్మ గౌరవ యాత్ర'

గురువారం, 22 ఆగస్టు 2013 (22:11 IST)
WD
నందమూరి వంశం నుంచి చంద్రబాబు నాయుడుకు మరో తిరుగుబావుటా హరికృష్ణ రూపంలో వస్తోందా...? ఎన్నాళ్లగానో పార్టీలో తమను కూరాకును తీసేసినట్లు తీసేసి జూనియర్ ఎన్టీఆర్ కు తగు ప్రాధాన్యత కల్పించకపోవడంపై గుర్రుగా ఉన్న హరికృష్ణ ఇక బహిరంగ యుద్ధానికి దిగబోతున్నారా అంటే అవుననే అంటున్నారు.

గత కొన్ని నెలలుగా చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టకుండానే, ఎన్టీఆర్ బిడ్డగా రాష్ట్ర విభజనను అంగీకరించలేకపోతున్నానని చెప్పుకున్నారు. అందువల్ల పదవికి రాజీనామా చేసి ప్రజా చైతన్య రథయాత్రలు కోస్తా ఆంధ్రాలో చేస్తానని ప్రకటించారు.

ఇక్కడే అసలు ట్విస్టు ఉంది. చంద్రబాబు నాయుడు ఇప్పటికే విభజనపై తెలుగు ఆత్మ గౌరవ యాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు. అందుకుగాను ఆయన ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరించిన నాయకుడుగా సీమాంధ్రలో యాత్ర చేయబోతున్నారు. హరికృష్ణ అలా కాదు. సమైక్యాంధ్ర నినాదాన్ని చేసుకుని రథయాత్ర చేపట్టనున్నారు.

తెలంగాణకు సై అంటూ కాంగ్రెస్ విభజన చేస్తున్న తీరు బాగా లేదని చెప్పే చంద్రబాబు నాయుడు యాత్రకు ప్రజలు స్పందిస్తారో... సమైక్య నినాదంతో ముందుకు కదలబోతున్న హరికృష్ణ ప్రజా చైతన్య రథయాత్రకు బ్రహ్మరథం పడతారో చూడాలి.

వెబ్దునియా పై చదవండి