కెసిఆర్ కు పవన్ కళ్యాణ్ దడ... అంతర్గత సర్వేలు చేయించుకుంటున్నారా..?!!

శనివారం, 15 మార్చి 2014 (20:03 IST)
FILE
పవన్‌ కళ్యాణ్‌... పేరు ఇప్పుడు హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా మారుమోగిపోతుంది. ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాల్లో సరేసరి. ముఖ్యంగా సమైక్యాంధ్రలో రాజకీయ నాయకుల్ని పవన్ కళ్యాణ్‌తో పోలుస్తూ ఇన్నాళ్ళకు ధీటైనవాడు బయటకు వచ్చాడనే కామెంట్లు చేస్తున్నారు.

తెలంగాణ విడిపోయాక.. సమైక్యాంధ్రులపై చేసిన రకరకాల మాటల యుద్ధాలకు పవన్‌ ధీటైన సమాధానం ఇచ్చాడనీ, ఇటువంటి నాయకుడే ప్రస్తుతం కావాలని ప్రజలు అంటున్నారు. హైదరాబాద్‌లో నలుగురు ఉన్న చోట పవన్‌ కళ్యాణ్‌ గురించే చర్చ జరుగుతోంది. తను పార్టీ పెడితే ఏం చేస్తాడో.. చేయడో అనవసరం... కెసీఆర్‌ వంటి నాయకులకు పోటీగా అన్నింటిల్లో నిలిచే వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ను పేర్కొంటున్నారు.

తెలంగాణ ప్రాంత వాసులే... ఆంధ్రోళ్ళకు సరైన వ్యక్తి లభించాడనీ, మిగిలిన నాయకులు ఆయన్ను చూసి బుద్ధి తెచ్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఇంకా పార్టీ ద్వారా ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనేది నిర్ణయించలేదని పవన్‌ చెబుతున్నా.. అంతర్గతంగా ఆయన నిలబడటానికి ప్లాన్‌ చేసుకున్నారనీ, ఇదంతా పొలిటికల్‌ స్టంట్‌ అనీ... వ్యాఖ్యానాలు విన్పిస్తున్నాయి.

మరో విషయం ఏమిటంటే... పవన్ మెయిన్ టార్గెట్ తెలంగాణ ప్రాంతమేనని అంటున్నారు. దీంతో పవన్ ఎంట్రీ తర్వాత తెలంగాణలో పరిస్థితి ఏంటని కెసిఆర్ అంతర్గత సర్వేలు కూడా చేయించుకుంటున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి