అమర వీరుల బలిదానాలతో 'తెలంగాణ' పంట... కేసీఆర్ చేతికొచ్చిన వేళ....

Venkateswara Rao. I

శనివారం, 29 మార్చి 2014 (12:43 IST)
WD
తెలంగాణ రాష్ట్ర సాధనకు అహరహం నిద్రలేని రాత్రులు గడిపి తమ ప్రాణాలను బలి పెట్టయినా తెలంగాణను సాధించాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఆత్మ బలిదానాలు చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు తెలంగాణలో ఏదయినా రాజకీయ పార్టీ న్యాయం చేయాలి అని అంటే ముందువరుసలో ఉండాల్సింది తెరాస. కానీ అమరవీరుల కుటుంబాలకు జరుగుతున్నదేమిటి...? అసలు ఉద్యమకారులకు తెరాస నుంచి అందుతున్నదేమిటి...?

ఉద్యమాన్నే ఊపిరిగా తెలంగాణ లక్ష్య సాధనకు నడుం బిగించి కదిలిన యువతకు తెరాస ఇస్తున్నదేమిటి..? తెలంగాణ ఉద్యమంలో రాళ్లెత్తి కొట్టిన నాయకుల పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఉద్యమకారులపై తెరాస చూపలేకపోవడం వెనుక కారణాలు ఏమిటి? ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో చర్చనీయాంశాలుగా ఉన్నాయి.

ఉద్యమంలో ముందుండి నడిచిన వ్యక్తి చెరుకూరి సుధాకర్. ఈయనకు ఈ ఎన్నికల్లో కేసీఆర్ మొండి చేయి చూపించారు. ఉద్యమంలో ఎన్నో కష్టనష్టాలను చవిచూసిని చెరుకూరికి చేదు ఎదురయింది. చెరుకూరికి టిక్కెట్ ఎందుకు ఇవ్వలేదని అడిగితే... 2004లో టికెట్ ఇస్తే డిపాజిట్ కూడా రాలేదని అంటున్నారుట.

అసలు 2004లో తెరాస సోదిలో కూడా లేదని ఎవరయినా అంటే కెసిఆర్ ఏమంటారో కానీ ఈసారి ఫ్యామిలీ లెక్కలతో ముందుకు వెళుతున్నారు. కుమార్తె కవితకు లోక్ సభ టిక్కెట్, అల్లుడు హరీశ్ రావుకు మరోచోట... కుమారుడు కెటీఆర్ కు ఇంకో చోట... ఇంకా మరికొందరు కుటుంబ సభ్యులుంటే వారికి కూడా కేటాయించేవారేమో కానీ ప్రస్తుతానికి వీరికి మాత్రం టిక్కెట్లు కన్ఫర్మ్ చేసేశారు.

ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో హైదరాబాద్ సిటీ అంతా కెసిఆర్ ఫ్లెక్సీలు తెగ దర్శనమిచ్చేవి. అవన్నీ పెట్టించింది రామ్మోహన్ అంటారు. ఆయన తనకు సనత్ నగర్ సీటును ఇవ్వాలని కోరితే... అలాక్కాదు విజయవాడకు చెందిన ఓ బడా వ్యాపారవేత్తకు ఇచ్చేయాలని అనుకున్నట్లు చెప్పారట. ఈ విషయం తెలియడంతో ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రామ్మోహన్ మారుమాట మాట్లాడలేకపోయారట.
అమరవీరుల కుటుంబాలకు తెరాస మొండిచెయ్యి....
తెలంగాణ ఉద్యమంలో రాళ్లెత్తి కొట్టిన నాయకుల పట్ల చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఉద్యమకారులపై తెరాస చూపలేకపోవడం వెనుక కారణాలు ఏమిటి? ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో చర్చనీయాంశాలుగా ఉన్నాయి.


ఇక ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థుల సంగతైతే ఇక వేరే చెప్పక్కర్లేదు. వారిలో విద్యార్థి సంఘాల నాయకులు బాల్క సుమన్, శామ్యూల్, శ్రీనివాస్ వంటివారిలో ఏ ఒక్కరినీ పిలిపించి మాట్లాడినట్లు కూడా లేదని అంటున్నారు. ఇక టిక్కెట్లు ఏమిస్తారూ... అనే విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే... మానుకోట ఘటనలో తెలంగాణ వాదులపై రాళ్లు విసిరిన కొండా సురేఖను పిలిచి మరీ టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చి గులాబీ కండువా కప్పారు.

మరి ఆనాడు వారి చేతుల్లో రాళ్ల దెబ్బలు తిన్నాం కదా అని ఉద్యమకారులు అడిగితే వినిపించుకునేదెవరు అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిన్న జరిగిన టిజెఏసి సమావేశంలోనూ తెరాస ఆచరిస్తున్న విధానంపై నాయకులంతా తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చారు. ఇలా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి సంఘాల నాయకులను, విద్యార్థులను, అమరవీరుల కుటుంబాలను దూరంపెట్టి కేసీఆర్ ఎలా నెగ్గుకు వస్తారో వెయిట్ అండ్ సీ.

వెబ్దునియా పై చదవండి