త్వరలోనే ఆన్‌లైనా వీసా జారీ కేంద్రం ఏర్పాటు: శ్రీలంక

సుమారు 30 సంవత్సరాల పాటు అంతర్గత కుమ్ములాటలతో సతమతమైన శ్రీలంక ఇపుడు మెల్లగా అభివృద్ధి పథంవైపు అడుగులు వేస్తోంది. ఇందులోభాగంగా, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడు మహీందా రాజపక్సే చర్యలు చేపట్టారు. అలాగే, దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేలా ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నారు.

వీటిని తిలకించేందుకు వచ్చే విదేశీ పర్యాటకుల కోసం ఆన్‌లైన్ వీసాలు జారీ చేసేలా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ విధానం వల్ల పర్యాటకులు శ్రీలంక ఎంబసీలకు వెళ్లకుండానే నిబంధనల మేరకు త్వరితగతిన వీసాలను పొందే సౌకర్యం లభిస్తుంది. ఈ విధానాన్ని సాధ్యమైనంత త్వరలో ప్రవేశపెట్టాలని దేశాధ్యక్షుడు ఆదేశించినట్లు ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు.

ఇన్వెస్టర్లు, వ్యాపారవేత్తల కోసం బహుళ స్థాయి ప్రవేశ వీసాలను జారీ చేయనున్నట్లు లంక ప్రభుత్వం గత నెలలో తెలిపింది. లంక సైన్యానికి, ఎల్టీటీఈ తీవ్రవాదులకు మధ్య సాగిన అంతర్యుద్ధం ముగిసిన తర్వాత శ్రీలంకలో పర్యటించే పర్యాటకుల సంఖ్య ఎక్కువైంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలనే లంక ప్రభుత్వం భావిస్తోంది.

వెబ్దునియా పై చదవండి