తాలిబన్ మా శత్రువు కాదన్న యూఎస్ వ్యాఖ్యలపై హర్షం!

ఆదివారం, 1 జనవరి 2012 (15:10 IST)
తాలిబన్ తీవ్రవాద సంస్థ తమకు శత్రువు కాదని అగ్రరాజ్యం అమెరికా చేసిన వ్యాఖ్యలను ఆప్ఘనిస్థాన్ అధ్యక్షుడు హామీద్ కర్జాయ్ స్వాగతించారు. దీనిపై ఆయన కాబూల్‌లో స్పందిస్తూ తాలిబన్ తమ శత్రువు కాదని అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ చేసిన వ్యాఖ్యల పట్ల తాము సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. ఈ తరహా వ్యాఖ్యలు ఆప్ఘనిస్థాన్‌లో శాంతి స్థాపనకు, స్థిరత్వానికి ఉపకరిస్తాయన్నారు.

అంతేకాకుండా, శాంతి చర్చల కోసం తాలిబన్ సంస్థకు ఓ కార్యాలయాన్ని ఖతార్‌లో ఏర్పాటు చేసుకునేందుకు అమెరికా సమ్మతించే తామేమీ అడ్డుచెప్పబోమన్నారు. ఈ శాంతి చర్చల ప్రక్రియలో తాము కూడా భాగస్వాములం అవుతామన్నారు.

ఇదిలావుండగా, జో బిడెన్ చేసిన వ్యాఖ్యలు అమెరికాలో కలకలం సృష్టించాయి. తాలిబన్ తీవ్రవాదులను తుదముట్టించేందుకు గత దశాబ్దకాలంగా అమెరికా పోరాటం చేస్తున్నప్పటికీ పూర్తి విజయాన్ని సొంతం చేసుకోలేక పోతుంది. ఈ పరిస్థితుల్లో ఒక రాజకీయ పరిష్కారం కనుగొనేందుకు మాత్రమే ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి