జగన్ సమైక్య మంత్రం 13 జిల్లాల్లోనేనా...? జనం నమ్మడం లేదా...?

గురువారం, 23 జనవరి 2014 (13:25 IST)
FILE
జగన్ మోహన్ రెడ్డి... అంటే ఒకప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో గుబులు రేకెత్తించారు. కానీ ఇప్పుడు ఆయన పొలిటికల్ పవర్ స్ట్రెంగ్త్ మెల్లమెల్లగా పడిపోతోందని అంటున్నారు. దీనికి కారణం జగన్ మోహన్ రెడ్డి సమైక్య రాష్ట్రం విషయంలో తీసుకున్న స్టాండ్ అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా సమైక్యాంధ్రకు మద్దతు అంటూ కేవలం సీమాంధ్రకు చెందిన 13 జిల్లాలకే ఆయన పర్యటనలు, ప్రసంగాలు, బంద్ లు పరిమితమవడంపై విమర్శలు వస్తున్నాయి. పైగా సమైక్యాంధ్ర సాధన అంశంలో విభజన వాదంలో ప్రధాన పాత్రను పోషిస్తున్న కేసీఆర్ ను పల్లెత్తు మాట అనకపోవడంపైనా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇదేదో కేసీఆర్ - జగన్ ల మధ్య ఫిక్సింగ్ జరగడం వల్లనే అలా వ్యవహరిస్తున్నారంటూ తెదేపా నాయకులు విమర్శిస్తున్నారు.

ఇదిలావుంటే ఇటీవల జగన్ మోహన్ రెడ్డిపై అనకాపల్లి ఎంపీ సబ్బం హరి ఓ రేంజిలో ఫైర్ అయ్యారు. జగన్ గ్రాఫ్ వంగిపోతోందనీ, ఆయనకు మునుపున్నంత క్రేజ్ లేకుండా పోయిందని విమర్శించారు. దీనికి కారణం జగన్ మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర అంశంలో అనుసరిస్తున్న విధానమేనని సబ్బం విమర్శించారు. మరి జగన్ మోహన్ రెడ్డి ఈ విమర్శలను ఎలా తిప్పికొడతారో... సమైక్యాంధ్ర కోసం తెలంగాణ జిల్లాల్లో ఏమైనా పర్యటిస్తారో చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి