వారిద్దరికి ప్రధాని స్థాయి భద్రతా.. నో ఛాన్స్: హోంశాఖ

సోమవారం, 16 నవంబరు 2009 (11:52 IST)
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిలకు రాష్ట్రపతి, ప్రధాని స్థాయి భద్రత కల్పించేంత సీన్ లేదని కేంద్ర హోం శాఖ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన ప్రతిపాదనలను హోంమంత్రిత్వ శాఖ తిప్పి పంపింది. ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు తమ ముఖ్యమంత్రులకు అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్ఎల్) తరహా భద్రతను కల్పించాలని కోరుతూ నివేదికను కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపాయి.

ఏఎస్ఎల్ ప్రకారం.. వీఐపీ పర్యటనకు వస్తున్నట్టు తెలిస్తే ఆ వీఐపీ పర్యటించే ప్రాంతాన్ని 24 గంటలకు ముందుగానే భద్రతా బలగాలు తనిఖీ చేయడమే కాకుండా, ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటాయి. ఆ తర్వాత సెఫ్టీ సర్టిఫికేట్‌ను వీఐపీ కార్యాలయానికి పంపుతారు. అటు పిమ్మటే వీపీఐ ఆ ప్రాంతంలో పర్యటిస్తారు.

ఈ తరహా భద్రత కేవలం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధానిలకు మాత్రమే ఉంది. అయితే, ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉన్నందున యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ, ప్రతిపక్ష నేత ఎల్కే అద్వానీలకు కూడా ఈ భద్రతను కల్పిస్తున్నారు. ఇలాంటి భద్రతను తమ ముఖ్యమంత్రులకు కూడా కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి.

ఈ విజ్ఞప్తిని హోం శాఖ తోసిపుచ్చుతూ నివేదికలను తిరిగి పంపించింది. వీరిద్దరిని ఏఎస్ఎల్ కేటగిరీలో చేర్చలేమని హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వీరిద్దరికి ప్రస్తుతమున్న ఎన్ఎస్‌జి గార్డ్స్ భద్రతను కల్పిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి