బీహార్ అసెంబ్లీ తుది దశ పోలింగ్‌లో 49 శాతం ఓటింగ్

బీహార్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా శనివారం ముగిసిన తుది దశ పోలింగ్‌లో 49 శాతం మాత్రమే ఓటింగ్‌ నమోదైంది. తుది దశ ఎన్నికల్లో ఎలాంటి హింసాత్మక చర్యలు చోటు చేసుకోక పోయినప్పటికీ మావోయిస్టుల దాడిలో ఇద్దరు పోలీసులు మృత్యువాత పడ్డారు.

తుది దశలో మొత్తం 26 అసెంబ్లీ సీట్లకు ఎన్నికల పోలింగ్ జరుగగా మొత్తం 426 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. ఈ దశలో స్పీకర్, జేడీయూ నేత ఉదయ్ నారాయణ్ చౌదరీ, భాజపా మంత్రి అవదీష్ నారాయణ్ సింగ్, జేడీయూ మంత్రులు చెడీ పాశ్వాన్, అనిల్ కుమార్‌‍లు ఉన్నారు. వీరితో పాటు కేంద్ర మాజీ మంత్రి, ఆర్జేడీ నేత కాంతీ సింగ్, ఆర్జేడీ నేతలు షకీల్ అహ్మద్ ఖాన్, సురేష్ పాశ్వాన్, ఇలియాస్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.

గయా జిల్లాలోని లోండా గ్రామంలో మావోయిస్టులు పేల్చిన మందుపాతరకు బీహార్ మిలిటరీ పోలీసు విభాగానికి చెందిన ఒక కానిస్టేబుల్, ఒక హోమ్‌గార్డులు మృత్యువాత పడ్డారు. అలాగే, ముగ్గురు జర్నలిస్టులతో పాటు తొమ్మిది మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

వెబ్దునియా పై చదవండి