జీఎస్‌ఎల్‌వీ - ఎఫ్ 06 రాకెట్ ప్రయోగం విఫలం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శనివారం సాయంత్రం చేపట్టిన జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 06 రాకెట్ యోగం విఫలమైంది. సరిగ్గా 4.04 నిమిషాలకు నిప్పులు చెరుగుతూ నింగికెగసిన కొన్ని క్షణాల్లోనే రాకెట్ నేలకూలింది. మొదటి దశలోనే సాంకేతిక లోపం తలెత్తడంతో అంతరిక్ష కక్షలోకి చేరకుండానే జీఎస్‌ఎల్‌వీ - ఎఫ్ 06 పేలిపోయింది. ప్రయోగించిన 20 సెకన్లలోనే ఇది చోటు చేసుకుంది. ప్రయోగం విఫలం కావడంతో ఇస్రో శాస్తవ్రేత్తలు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.

అంతకుముందు జీశాట్ ఎఫ్-6 ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెల్సిందే. శుక్రవారం ఉదయం ప్రారంభమైన కౌంట్‌డౌన్ అంటే.. 29 గంటల కౌంట్ డౌన్ తర్వాత జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్06 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రష్యా, భారత్‌కు చెందిన శాస్తవ్రేత్తలు పర్యవేక్షణలో ఈ ప్రయోగం జరిగింది. గత సోమవారమే ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉండగా, క్రయోజెనిక్ దశలో ఏర్పడిన ఇంధన లీకేజీతో ఈ ప్రయోగాన్ని వాయిదా వేశారు.

ఈ రాకెట్ ద్వారా జీశాట్- పీ5 ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టాలని భావించారు. 19 నిమిషాల్లో ఈ ప్రయోగం పూర్తవుతుందని తొలుత భావించారు. ఈ ప్రయోగం విజయవంతమైతే టెలివిజన్, టెలికమ్యూనికేషన్, టెలీ మెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్ రంగాల్లో 13 ఏళ్ల పాటు ఈ ఉపగ్రహం సేవలు అందించేలా రూపకల్పన చేశారు.

వెబ్దునియా పై చదవండి