అజ్మీర్ పేలుళ్ళ కేసులో అసీమానంద అరెస్టుకు కోర్టు ఆదేశం!

దేశంలోని సంఘ్ పరివార్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అజ్మీర్ దర్గాలో 2007లో జరిగిన బాంబు పేలుళ్ళ కేసులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) నేత స్వామి అసీమానందను అరెస్టు చేయాల్సిందిగా స్థానిక కోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాజస్థాన్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మితవాద గ్రూపునకు చెందిన అభినవ్ భారత్‌ సభ్యుడైన అసీమానంద అజ్మీర్ బాంబు పేలుళ్ళ కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. ఈ పేలుళ్ళలో ముగ్గురు మృత్యువాత పడ్డారు.

ఈ కేసులో అసీమానందను కోర్టులో హాజరుపరచాలని గత గురువారం కోర్టు రాష్ట్ర ఏటీఎస్‌కు ఆదేశాలు జారీచేయడంతో ఆ విధంగా కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ రతన్ లాల్ మూంద్ తాజాగా అసీమానందను అరెస్టు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

2007లో మక్కా మసీదులో జరిగిన పేలుళ్ళ కేసులో సంబంధముందనే ఆరోపణలపై గత యేడాది నవంబరు నెలలో అసీమానందను అరెస్టు చేశారు. ఈ కేసులో తన పాత్రపై మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం కూడా ఇచ్చాడు. 2007లో 37 మంది ప్రాణాలు తీసిన మాలేగావ్‌లో జరిగిన పేలుళ్ళకు మితవాద గ్రూపులో కారణమని అసీమానంద వాంగ్మూలం ఇచ్చాడు.

వెబ్దునియా పై చదవండి