భాజపా నిరసన: బంద్ వాతావరణాన్ని తలిపిస్తున్న కర్ణాటక

కర్ణాటక రాష్ట్రంలో అధికార భారతీయ జనతా పార్టీ శ్రేణులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ వాతావరణాన్ని తలపిస్తోంది. భూకుంభకోణం ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప, హోం మంత్రి అశోక్‌లు అశ్రీత పక్షపాతానికి పాల్పడ్డారని, అందువల్ల వారిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శివమొగ్గాకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులో విజ్ఞాపనపత్రం సమర్పించారు.

దీన్ని పరిశీలించిన గవర్నర్ హెచ్.ఆర్.భరద్వాజ్ ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. అయితే, ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేయబోరని సీనియర్ మంత్రులు తేల్చి చెప్పారు. అదేసమయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తున్న గవర్నర్‌ను తక్షణం రీకాల్ చేయాలని భాజపా శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి.

ఇందులోభాగంగా పలు చోట్ల బస్సు అద్దాలను పగులగొట్టారు. మరికొన్ని చోట్ల ధర్నాలు, రాస్తారోకోలకు దిగారు. ఇదిలావుండగా, తనను అరెస్టు చేసి ప్రాసిక్యూట్ చేయాలంటూ గవర్నర్ అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.

వెబ్దునియా పై చదవండి