2012లో పెను మార్పులు చోటు చేసుకుంటాయి : అద్వానీ

ఆదివారం, 1 జనవరి 2012 (10:35 IST)
కొత్త సంవత్సరమైన 2012లో జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే. అద్వానీ జోస్యం చెప్పారు. కొత్త సంవత్సరం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక సందేశం ప్రకటనను విడుదల చేశారు. ఇందులో యూపీఏ ప్రభుత్వానికి 2011 సంవత్సరం భయంకరమైన సంవత్సరంగా మిగిలిందని, ఈ ఏడాదిలో ఒకదాని వెంట మరొకటిగా వరుస కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయని ఆయన గుర్తు చేశారు.

లోక్పాల్ బిల్లు అంశం రాజ్యసభ ముందుకు వచ్చినప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యూహాత్మక మౌనాన్ని పాటించడం సరైన చర్య కాదన్నారు. బలమైన లోక్పాల్ బిల్లును ప్రవేశపెట్టాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. ఈ విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తే లేదన్నారు.

మన్మోహన్ సింగ్ నుంచి దేశం చిత్తశుద్ధి గల, పారదర్శకమైన నాయకత్వాన్ని ఆశిస్తే, ఆయన ఈ అంశంలో కుట్రపూరితమైన మౌనాన్ని అవలంభించారని విమర్శించారు. కొత్త సంవత్సరంలో రాజకీయాలు బీజేపీకీ, ఎన్డీయేకు సానుకూలంగా ఉంటాయన్నారు. మొత్తం మీద 2012లో జాతీయ స్థాయిలో పెను మార్పులు చోటు చేసుకోవచ్చన్నారు.

వెబ్దునియా పై చదవండి