సుప్రీంకోర్టు వ్యాఖ్యలు : పేదలకు అందని ద్రాక్షలా న్యాయం!

సోమవారం, 26 ఆగస్టు 2013 (10:47 IST)
File
FILE
పేదల న్యాయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అన్ని కోర్టుల్లో న్యాయం ఖరీదైపోయిందని, దీంతో పేదలకు న్యాయం అందని ద్రాక్షలా మారిందని అభిప్రాయపడింది. మారుతున్న కాలంతో పాటు న్యాయవాదవృత్తి వ్యాపారమైపోయిందని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయం వ్యాపారం కాదని హితవు పలికింది.

గత వారం ఒక కేసు విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ బి.ఎస్.చౌహాన్, జస్టిస్ ఎస్.ఎ.బోద్బేలతో కూడిన ధర్మాసనం పైవిధంగా వ్యాఖ్యానించింది. వివిధ రకాల కారణాల రీత్యా న్యాయ విచారణ చాలా ఆలస్యంగా సాగుతోందని, ఫలితంగా ఒక కేసు పరిష్కారమయ్యేసరికి తమ జీవితకాలం సరిపోదనే అభిప్రాయంలో దేశ ప్రజలు ఉన్నారని ప్రస్తావించింది.

ఒకప్పుడు ఎంతో గౌరవమైన న్యాయవృత్తి ఇప్పుడు అదొక వ్యాపారంగా పరిణామం చెందుతోందని వ్యాఖ్యానించింది. స్వలాభం కోసం కక్షిదారుల ప్రయోజనాలకు భంగం కలిగేలా ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహించడం న్యాయవాదికి శ్రేయస్కరం కాదని హితవు పలికింది. దురదృష్టవశాత్తు అన్నింటికి అతీతంగా ఉండవలసిన న్యాయమూర్తులు కూడా పలువురు విమర్శలకు గురవుతున్నారని ధర్మాసనం వాపోయింది.

వెబ్దునియా పై చదవండి