ఫోటో జర్నలిస్టునే కాదు... మరో నలుగురు అమ్మాయిల్ని గ్యాంగ్ రేప్ చేశాం...

మంగళవారం, 27 ఆగస్టు 2013 (12:24 IST)
FILE
ముంబైలో మహిళా ఫోటో జర్నలిస్టుపై ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ చేసిన కేసు గురించి తోడేకొద్దీ కొత్తకొత్త విషయాలు బయటపడుతున్నాయి. గ్యాంగ్ రేప్ ప్రధాన సూత్రధారుడు ఖాసిం బంగాలి నుంచి మరికొన్ని వివరాలను రాబట్టారు. అతడు చెప్పిన వివరాల ప్రకారం... తాము ఫోటో జర్నలిస్టుపై చేసిన గ్యాంగ్ రేప్ మొదటి సామూహిక అత్యాచారం కాదనీ, గత ఏడాది నుంచి నలుగురు మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డట్టు చెప్పాడు.

అంతేకాదు... గ్యాంగ్ రేప్ చేసే సమయంలో తమ గ్యాంగ్ సభ్యులు అత్యాచారం జరిపేటపుడు వీడియోలు కూడా తీసినట్లు అతడు ఒప్పుకున్నాడు. అత్యాచారం చేసిన తర్వాత ఎవరికయినా చెపితే ఈ వీడియో క్లిప్పింగులను బయటపెడతామనీ, ఇంకా ఎదురుతిరిగితే చంపేస్తామని బెదిరించినట్లు అతడు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అత్యాచారానికి గురయిన నలుగురు మహిళలు మారుమాట్లాడకుండా కేసు కూడా పెట్టలేదని పోలీసులు చెపుతున్నారు.

శక్తి మిల్స్ వైపు పొరపాటును యువ జంటలు వస్తే వారిని వేధింపులకు గురి చేయడం తమకు సర్వసాధారణమయిన విషయమని తెలిపారు. అదేవిధంగా గ్యాంగ్ రేప్ చేసిన తర్వాత ఘటన జరిగిన ప్రాంతాన్ని బాధితుల చేత శుభ్రం చేయించి, వారిని బెదిరించి పంపేస్తామని నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఒప్పుకున్నాడు.

కాగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలు ముంబై జస్లోక్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తన ఆరోగ్యం మెరుగుపడగానే విధులకు హాజరవుతానని వెల్లడించింది. అత్యాచారం జరిగితే ఇక జీవితం ముగిసిపోలేదని ఆమె తన కుటుంబ సభ్యులతో అంటోంది.

వెబ్దునియా పై చదవండి