లోక్‌సభలో 'లక్కీ స్టార్': అత్యంత పిన్న వయసులో ఎంపీగా రమ్య!

FILE
అందాల నటిగా అసంఖ్యాక ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్న ఆమె నేడు దేశ రాజకీయ రంగంలో సరికొత్త రికార్డును కైవసం చేసుకుంది. అత్యంత పిన్న వయసులో ఎంపీగా ఎన్నికైన తొలి మహిళగా ఆమె సంచలనం సృష్టించింది.

కన్నడ సినీ పరిశ్రమకు చెందిన రమ్య (30) మాండ్యా లోక్‌సభ స్థానానికి తాజాగా జరిగిన ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కర్నాటకలో సినీ అభిమానులంతా ‘లక్కీస్టార్’గా పిలుచుకునే రమ్య అనుకోని రీతిలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

ఉప ఎన్నిక సందర్భంగా నామినేషన్ వేసే సమయంలోనే రమ్య తండ్రి ఆకస్మికంగా మృతి చెందడంతో ఆమె పోటీలో ఉంటారా? లేదా? అన్న విషయమై అనుమానాలు చెలరేగాయి. అయితే, తండ్రి మరణాన్ని మానసికంగా తట్టుకుని ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని, విజయాన్ని కైవసం చేసుకున్నారు.

ప్రజా ప్రతినిధిగా చట్టసభలో అడుగుపెడుతున్నందున ప్రస్తుతానికి సినిమాలకు దూరంగా ఉంటానని రమ్య ప్రకటించారు. మాండ్యాకు చెందిన ఆమె ఊటీ, చెన్నై, బెంగళూరులో చదువుకుని, 2003లో కన్నడ సినీ రంగంలో ‘తెరంగేట్రం’ చేశారు. రెండుసార్లు ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డులతో పాటు పలు పురస్కారాలు అందుకున్నారు.

వెబ్దునియా పై చదవండి