తప్పు చేసి ఉంటే.. ఉరితీయండి : నరేంద్ర మోడీ ఆవేదన

గురువారం, 17 ఏప్రియల్ 2014 (10:13 IST)
File
FILE
గుజరాత్ రాష్ట్రంలో జరిగిన గోద్రా అల్లర్లపై తానెన్నడూ మౌనంగా ఉండలేదని బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. అలాగే, ఈ అల్లర్లకు సంబంధించి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.

బుధవారం ఒక వార్తాసంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన మనస్సులోని ఆవేదనను, అక్రోశాన్ని వెళ్ళగక్కారు. అలర్లపై క్షమాపణ చెప్పాలనే వాదనను తోసిపుచ్చారు. తప్పు చేసి క్షమాపణ చెప్పినంత మాత్రాన ఒరిగేదేమిటని ప్రశ్నించారు.

అంతేకాకుండా తనపై చాలామంది చాలా ఆరోపణలు చేస్తున్నారు. వాటిలో ఇసుమంత నిజమున్నా తనను నడివీధిలో, నాలుగు రోడ్ల కూడలిలో ఉరితీయండి. మరో వందేళ్లపాటు ఇంకెవ్వరూ అలాంటి తప్పు చేసేందుకు సాహసించకూడదు... అంత కఠినమైన శిక్ష విధించండి అంటూ ఆక్రోశించారు.

క్షమాపణ చెబితే నేరస్థులను వదిలేస్తారా? ఇదేం పద్ధతి! తప్పు చేసింది నేనే అయినా సరే... క్షమించొద్దు. శిక్షించాల్సిందేనని పునరుద్ఘాటించారు. గుజరాత్ అల్లర్లపై 2002 నుంచి 2007 దాకా దేశంలో అనేకమంది సీనియర్ పాత్రికేయుల ప్రశ్నలకు జవాబిస్తూనే ఉన్నాను. కానీ, వాస్తవాలను అర్థం చేసుకునేందుకు తగిన ప్రయత్నం ఏ ఒక్కరూ చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి