కేసీఆర్ తెలంగాణలో మళ్లీ రగుల్చుడు... ఢిల్లీ రాయబారం విఫలం

గురువారం, 8 నవంబరు 2012 (19:24 IST)
FILE
కేసీఆర్ మళ్లీ తెలంగాణ ఉద్యమ అగ్గిరవ్వను విసిరారు. ఇక రగలడమే తరువాయి. తెలంగాణ కోసం తను ఢిల్లీ వెళ్లిన రాయబారం బెడిసికొట్టిందనీ, కాంగ్రెస్ పార్టీ మరోసారి మోసం చేసిందనీ అన్నారు. కరీంనగర్ జిల్లాలో 2 రోజుల మేధోమథనం అనంతరం ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై చర్చించేందుకు తనను ఢిల్లీకి ఆహ్వానించిందన్నారు.

ఇందులో భాగంగా ఎంతోమంది నాయకులతో సమావేశమయ్యామన్నారు. హైదరాబాదుతో కూడిన 10 జిల్లాల తెలంగాణను ఇస్తే తెరాసను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సైతం తాను సిద్ధపడినట్లు చెప్పారు. ఐతే కాంగ్రెస్ పార్టీ తన మోసపూరిత శైలితో మరోసారి మోసం చేసిందన్నారు. 12 ఏళ్ల పోరులో ఎన్నో మోసాలు, ఎన్నో జయాలను చవిచూశామన్నారు.

తెలంగాణ కోసం నాలుగున్నర నెలలుగా కాంగ్రెస్ పార్టీ నేతలతో సంప్రదింపులు సాగిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌పై నమ్మకం లేకపోయినా ఢిల్లీకి వెళ్లి వచ్చామనీ, కాంగ్రెస్ మోసం తేలిపోయింది కనుక భవిష్యత్ ప్రణాళిక కోసమే మేధోమథనం ప్రారంభించామన్నారు. తెలంగాణ వచ్చే వరకూ ముందుకు సాగుతామని చెప్పారు.

ఇక తెరాసకు టిజేఏసీకి మధ్య అగాధం ఉన్నదంటూ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయనీ, అవన్నీ సత్యదూరమయినవన్నారు. జేఏసీకి తనకు మధ్య మహబూబ్ నగర్ స్థానం విషయంలో మనస్పర్థలున్న విషయం నిజమేనన్నారు. అంతమాత్రాన తమ మధ్య మరీ అంత అగాధమేమీ లేదన్నారు. రేపటి నుంచి జేఏసీని కలుపుకుని కాంగ్రెస్ పార్టీకి నరసింహావతారాన్ని చూపిస్తానని కేసీఆర్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి