ఆస్ట్రేలియా బాధితుడి కుటుంబానికి ప్రభుత్వ సాయం

ఆస్ట్రేలియాలో దాడికి గురై గాయాలపాలైన, హైదరాబాద్‌వాసి మీర్ ఖాసిం ఆలీఖాన్ కుటుంబానికి ప్రభుత్వం తన సహాయ సహకారాలను అందజేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ సాయంతో ఆలీఖాన్ కుటుంబ సభ్యులు తమ కుమారుడిని కలుసుకునేందుకు ఆస్ట్రేలియా వెళ్లనున్నారు.

ఈ విషయమై ఓ ప్రకటనను వెల్లడించిన ముఖ్యమంత్రి కార్యాలయం... ఆలీఖాన్ తండ్రి వృద్ధుడైనందున, ఆయన ప్రయాణం చేసే స్థితిలో లేనందువల్ల.. అతని తల్లిని, సోదరుడిని సోమవారం ఆస్ట్రేలియాకు పంపించనున్నట్లు పేర్కొంది. కాగా.. ఆలీఖాన్ కుటుంబ సభ్యులు ఆస్ట్రేలియా వెళ్లేందుకు, అక్కడ కొంత కాలం ఉండేందుకు, అవసరమైతే ఆలీఖాన్‌ను భారత్ తీసుకొచ్చేందుకు... రాష్ట్ర ప్రభుత్వం తరపున సహకారం అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్సార్ అంగీకరించారు.

ఈ మేరకు ఆలీఖాన్ కుటుంబ సభ్యులు తత్కాల్ కింద పాస్‌పోర్టును పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించింది. అలాగే, వారు రాష్ట్రానికి తిరిగివచ్చిన అనంతరం బాధితుడి చికిత్సకు, ఇతరత్రా వైద్య అవసరాలకు అయ్యే ఖర్చులను భరించేందుకు ప్రభుత్వం తన సంసిద్ధతను వ్యక్తం చేసింది.

వెబ్దునియా పై చదవండి