జస్‌ప్రీత్‌పై జరిగిన దాడి అబద్ధం: ఆస్ట్రేలియా

FILE
కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తనపై పెట్రోలుపోసి దాడికి పాల్పడినట్లు ప్రవాస భారతీయ యువకుడు జస్‌ప్రీత్ సింగ్ (29) అబద్ధం చెప్పినట్లు ఆస్ట్రేలియా పోలీసులు వెల్లడించారు. ఇది ఏ మాత్రం జాత్యహంకార దాడి కాదనీ, ఇన్య్సూరెన్స్ డబ్బుల కోసం జస్‌ప్రీత్ తన కారుకు తానే నిప్పంటించుకున్నాడని పోలీసులు పేర్కొన్నారు.

విచారణలో ఈ విషయాలన్నింటినీ ఒప్పుకున్న జస్‌ప్రీత్‌పై కుట్రపూరితంగా ఇన్స్యూరెన్స్ డబ్బులు రాబట్టుకున్నాడంటూ అభియోగాలు మోపామనీ, వచ్చే నెలలో విచారణ నిమిత్తం అతడిని మెల్‌బోర్న్ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు చెప్పారు. ఈ మేరకు ఆసీస్ పోలీసులను ఉటంకిస్తూ స్థానిక మీడియాలో తాజాగా పలు కథనాలు వెలువడ్డాయి.

ఇదిలా ఉంటే.. జనవరి 8వ తేదీన తనపై కొంతమంది దుండగులు పెట్రోలు పోసి, వాహనానికి నిప్పంటించి పారిపోయినట్లు జస్‌ప్రీత్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు వారం రోజులముందే నితిన్ గార్గ్ అనే విద్యార్థి ఆసీస్‌లో దారుణ హత్యకు గురయిన నేపథ్యంలో సింగ్ ఆరోపణలు మీడియాలో ప్రముఖంగా రావటంతో, భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో ఈ అంశంపై ఆసీస్ పోలీసులు విచారణను వేగం చేయగా.. సింగ్ భాగోతం బయటపడింది.

వెబ్దునియా పై చదవండి