మీరు కన్యారాశిలో పుట్టినవారైతే..?

FILE
ఉత్తరా నక్షత్రం-2,3,4, హస్తం, చిత్ర నక్షత్రాలు- 1, 2 పాదాలలో జన్మించిన జాతకులు కన్యారాశికి చెందిన వారవుతారని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ రాశికి అధిపతి బుధుడు కాబట్టి వాక్చాతుర్యం, గణితం, విద్య వంటి అంశాల్లో ఈ రాశిలో పుట్టిన జాతకులు రాణిస్తారు.

ఇంకా ఈ రాశిలో పుట్టిన జాతకులు అధికంగా భుజించటంలో ఆసక్తి చూపరు. మితమైన ఆహారంతో పాటు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడంతో వ్యాధులు వీరి దరికి చేరవు.

తమను తాము అర్థం చేసుకుని కార్యాచరణ చేసే ఈ జాతకులకు.. ఇతరులు ప్రశ్నించే ధోరణి ఏమాత్రం నచ్చదు. అప్పులను గురించి ఆలోచించి వాటికి తగినట్టు ఆర్థిక పరిస్థితులను సర్దుకుంటారు. ఇతరులకు సహాయపడే గుణం కలిగిన కన్యారాశి జాతకులు భవిష్యత్తులో లక్ష్యసాధన కోసం తీవ్రంగా శ్రమిస్తారు.

శత్రువులకు అనుగుణంగా కార్యసాధన చేస్తారు. స్వయం కృషితో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని ఆశిస్తారు. మంచి, చెడులను ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారు. పరిస్థితికి అనుకూలంగా తమల్ని మలచుకోవడంలో వీరికి చాతుర్యం ఎక్కువ.

అనుకున్నది సాధించేంత వరకు ఎలాంటి కష్టాలైనా ఎదుర్కొంటారు. వాగ్దానాలకు ముఖ్యత్వం ఇవ్వకుండా వాటిని కార్యాచరణలో పెట్టడంపై శ్రద్ధ చూపుతారు. ఇంకా కన్యారాశిలో పుట్టిన జాతకులు ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. చురుకుదనంగా ఉంటారు. విజ్ఞానంలో రాణిస్తారు.

ఇక కన్యా రాశిలో జన్మించిన మహిళలు నీతి నిజాయితీలకు ప్రాముఖ్యతనిస్తారు. విద్యారంగంలో రాణిస్తారు. ఆభరణాలు, గృహం వంటి వాటిని సంపాదించటంలో ఆసక్తి కనపరుస్తారు. సంగీతం వంటి కళల్లో కూడా వీరికి ఆసక్తి ఎక్కువని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

కన్యారాశిలో పుట్టిన జాతకులకు 5, 14, 23, 32, 41, 50, 59, 68 సంఖ్యలు అన్ని విధాలా కలిసివస్తాయి. అలాగే 1, 4, 6, 7 అనే సంఖ్యలు కూడా వీరికి అనుకూలిస్తాయి. కానీ 2, 3, 8, 9 సంఖ్యలు వీరికి ఏ మాత్రం శుభ ఫలితాలనివ్వవు. ఈ సంఖ్యల్లో ప్రారంభమయ్యే రోజుల్లో ఎలాంటి శుభకార్యాన్ని ప్రారంభించకూడదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఇంకా ఈ జాతకులకు బుధవారం అన్ని విధాలా అదృష్టమైన రోజు. బుధవారం ఎలాంటి కార్యాన్ని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తవుతుంది. ఇంకా శని, శుక్రవారాలు కూడా వీరికి సామాన్య ఫలితాలను అందిస్తాయి. కానీ మంగళవారం మాత్రం కన్యారాశి జాతకులకు ఏ మాత్రం కలిసిరాదు.

ఇకపోతే.. కన్యారాశి జాతకులకు ఆకుపచ్చ, ఆరంజ్, తెలుపు రంగులు శుభఫలితాలనిస్తాయి. ఈ రంగుల్లో దుస్తులు ధరిస్తే.. మనస్సులో ప్రశాంతత నెలకొంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. పచ్చ రంగులో చేతిరుమాలు వాడటం ద్వారా వ్యాపారంలో లాభం, ఈతిబాధలు తొలగిపోవడం వంటి ఫలితాలుంటాయి. ఈ జాతకులు ఎంపిక చేసే దుస్తుల్లో ఎక్కువగా పసుపు, ఆకుపచ్చ రంగులు కలిసి ఉండేలా చూసుకుంటే మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి