సాధారణంగా "కృషి" చేయనిదే ఏదీ కూడా సిద్ధించదని మన పెద్దలు చెపుతుంటారు. అసలు "కృషితో నాస్తి దుర్భిక్షమ్" అనే సూక్తి ఎలా వచ్చిందో తెలుసుకోవాలంటే అనుభవపూర్వకంగా జరిగిన ఒక పురాణ కథను మీరు తెలుసుకోవాల్సిందే.
అయోధ్య నగరానికి సమీపంలో చపియా అనే చిన్న పట్టణం ఉండేది. ఈ ప్రాంతానికి చెందిన బాలాదేవి, దేవశర్మల కుమారుడు స్వామి నారాయణుడు. బాల్యంలోనే భారత భాగవతాలతో పాటు.. చతుర్వేదాలను అధ్యయనం, చిన్నతనంలోనే విశిష్టాద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేసి పండిత మెప్పునూ పొందాడు. ఈ క్రమంలో నారాయణ స్వామి 11వ యేట ఉండగా తల్లిదండ్రులు స్వర్గస్తులయ్యారు. దీంతో మనస్సు విరక్తి చెందిన నారాయణుడు తన వద్ద ఉన్న సర్వాస్వాన్ని త్యజించి హిమాలయాల్లోని పూల్వాశ్రమంకు చేరాడు.
అక్కడ ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా దృఢచిత్తంతో సూర్యోపాసన చేసి దైవసాక్షాత్కారం పొందుతాడు. తన బ్రహ్మచర్య వ్రతం నుంచి విచలితం కాని మనోధైర్యాన్ని, సంకల్పాన్ని, దృఢచిత్తాన్ని పొంది హిమాలయాలు వీడుతాడు. అక్కడ నుంచి నేరుగా బంగాళాదేశానికి చేరుకుంటాడు. ఆ దేశంలో మదిర మాంస సేవనం చేస్తూ క్షుద్రశక్తుల వల్ల లభించిన శక్తితో సామాన్య ప్రజలను అష్టకష్టాలు పెడుతుండటాన్ని చూసి నారాయణడు చలించి పోతాడు.
వీటిని నిర్మూలించే పనిలో నిమగ్నమై పలవురి చేతుల్లో దాడులకు గురవుతాడు. అయితే, భగవంతుని శరణుజొచ్చిన వారిని క్షుద్రశక్తులు ఏమీ చేయలేవనీ, దైవారాధన వల్ల మానవ సేవ వల్ల మాత్రమే ప్రపంచ శాంతి సౌఖ్యాలు సిద్ధిస్తాయంటూ హితబోధ చేసి అక్కడ నుంచి శిష్యగణంతో బయలుదేరి గుజరాత్‌కు చేరుకుంటాడు.
అక్కడ వర్షాలు లేక తీవ్రమైన కరువు కాటకాలతో గుజరాతీయులు అల్లాడుతుండటాన్ని చూసి నారయణుని మనస్సు కష్టపడుతోంది. దీంతో తనవెంట ఉన్న శిష్యగణంతో బావులు, కుంటలు, చెరువులు తవ్విస్తాడు. వర్షాలు లేక తీవ్రమైన అలసత్వంతో నిండిన ప్రజలను ఉత్సాహవంతులను, చైతన్యవంతులను చేస్తాడు.
శ్రమించి పని చేసే వారికి తగిన ప్రతిఫలం అందేలా చూశాడు. అలా.. అనతి కాలంలోనే ఆ ప్రాంతం అందరి కృషి ఫలితంగా సస్యశ్యామలమైంది ఆ ప్రాంతం. ప్రజలకు ఆహారం, నీరు సమృద్ధిగా దొరకడంతో ఆ ప్రాంతమంతా కళకళలాడింది. అలా "కృషితో నాస్తి దుర్భిక్షమ్" అనే సత్య సూక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకునేలా నారాయణుడు చేశాడు.