భర్తకు కూడా "రాఖీ" కట్టవచ్చునట..!

"రక్షాబంధన్" అనే పండుగ మనకందరికీ బాగా తెలిసే ఉంటుంది. శ్రావణ పూర్ణిమ నాడు వచ్చే ఈ పండుగ రోజున సోదరులకు రాఖీ కట్టే చెల్లాయిలే మనకు ఎక్కువగా కన్పిస్తుంటారు.

తమ మర్యాదలకు ఎలాంటి భంగం కలగకుండా చివరి వరకు కాపాడే రక్షకులుగా సోదరులుండాలని ఆకాంక్షిస్తూ రాఖీని కట్టడం సంప్రదాయం.

అయితే సోదరులకే గాకుండా.. భర్తకు కూడా భార్య రాఖీ కట్టవచ్చునని, రాఖీకి చాలా పవిత్రత ఉందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ రాఖీకి ఉన్న పవిత్రత ఏమిటంటే? భార్య-భర్తకు, సోదరి-సోదరులకు కట్టే రాఖీ ద్వారా వారు తలపెట్టే కార్యములు విజయవంతమై, సుఖసంపదలు చేకూరుతాయని విశ్వాసం.

ఇంకా రాఖీ కట్టే సోదరీ మణులు, భార్యామణులు వారి మర్యాదలకు భర్త/సోదరుడు బాసటగా ఉండాలని ఆకాంక్షించే సత్ సంప్రదాయమే ఈ రాఖీ పండుగ.

అలా రాఖీలు కట్టించుకున్న భర్తలు, సోదరులు భార్య లేదా సోదరికి నూతన వస్త్రాలు, చిరుకానుకలు సమర్పించి, అందరూ కలిసి చక్కని విందు సేవిస్తారని పురోహితులు అంటున్నారు.

ఇకపోతే.. శ్రావణ పూర్ణిమ రోజున బ్రాహ్మణులు నూతన జంధ్యాలు ధరిస్తారు. ఈ రోజున బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతధారణలు చేసి విద్యార్థులకు వేదపఠనం ప్రారంభిస్తారు. 'జంధ్యాల పూర్ణిమ' అని పిలువబడే ఈ పండుగ కాలక్రమమున "రక్షాబంధన్ మరియు రాఖీ" పండుగగా ప్రాచుర్యం పొందింది.

వెబ్దునియా పై చదవండి