అంతా నా ఇష్టం - తితిదే ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి

సోమవారం, 26 సెప్టెంబరు 2016 (09:57 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి అంతా నా ఇష్టంగా వ్యవహరిస్తున్నారు. తితిదే వ్యవహారాల్లోగానీ, తిరుమల శ్రీవారి ఆలయంలో గానీ తను చెప్పినట్లే జరగాలన్న విధంగా ప్రవర్తిస్తున్నారు. ఏదైనా తేడా వస్తే ఇక తెలిసిందేగా... ఒకరికి ఒక చోట నుండి మరో చోటకు మార్చేస్తారు. కాంట్రాక్టు ఉద్యోగి అయితే ఆ పోస్టు నుంచే తీసేయిస్తారు. అది సార్‌..వ్యవహారం.. తితిదే ఛైర్మన్‌ ఒక సంవత్సరం పాటు చదలవాడ బాగానే ఉన్నా పదవికాలాన్ని పెంచిన తరువాత ఆయన ఈ విధంగా మారాడని టిడిపి నాయకులే బహిరంగంగా చెప్పుకుంటున్నారు.
 
తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ అంటే సాదాసీదా కాదు. దేశానికి ప్రధానమంత్రి పదవి ఎంతటిదో.. అంతటి ప్రాముఖ్యత కలిగినది తితిదే పదవి. మొత్తం రాజకీయ పలుకబడితోనే ఈ పదవిని దక్కించుకోవచ్చు. అదే ప్రస్తుతం జరుగుతోంది. తెలుగుదేశంపార్టీ ఎన్నికలు జరుగక ముందు తిరుపతి అసెంబ్లీ సీటును కోరుకున్న చదలవాడ చివరకు ఆ సీటు దక్కకుండా పోయారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి వచ్చిన వెంకటరమణకు తిరుపతి స్థానం దక్కింది. దీంతో అలిగిన చదలవాడ కొన్ని రోజుల పాటు దూరంగా ఉంటూ వచ్చారు. ఇంకేముంది.. అధినేతే ఏకంగా రంగంలోకి దిగి చదలవాడకు తితిదే ఛైర్మన్‌ పదవి అని ప్రకటించారు.
 
అనుకున్నట్లుగానే తితిదే ఛైర్మన్‌ పదవిని ఇచ్చారు. ఒక సంవత్సరం మాత్రమే పదవీ కాలాన్ని ఇచ్చి... తిరిగి మరో యేడాది కాలం పొడిగించారు. సంవత్సరం పాటు బాగానే ఉన్న ఛైర్మన్‌ ఆ తర్వాత ఆయనలో మార్పు వచ్చిందంటున్నారు టిడిపి నేతలు, ఆయన సన్నిహితులు.
 
తిరుమల శ్రీవారి ఆలయంలో తనకు ఇష్టమొచ్చినట్లు ఆయన వ్యవహరిస్తున్నారు. గత రెండురోజులకు ముందు సుప్రభాతంకు వెళ్ళిన తితిదే ఛైర్మన్‌ ఒక ఆరుమందిని వెంట బెట్టుకుని వెళ్ళారట. అది కూడా సుప్రభాతంకు హాజరయ్యే పండితులకన్నా ముందుగానే వెళ్ళిపోయారట. తితిదే నిబంధనలను బేఖాతరు చేయడం, తుంగలో తొక్కడం చదలవాడకు మాత్రమే తెలుసునన్నది దీన్ని బట్టి అర్థమవుతుంది. వారిని దగ్గర బెట్టుకుని మరీ హారతి ఇప్పించారట.
 
తితిదే ఛైర్మన్‌ తీరుపై తితిదే అధికారులే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏ తితిదే ఛైర్మన్‌ కూడా ఈ విధంగా వ్యవహరించ లేదని, ప్రస్తుత ఛైర్మన్‌ ఆడిందే ఆటగా, పాడిందే పాటగా సాగుతోంది. ఇది ఒకటే కాదు. ఇలాంటివి ఎన్నెన్నో. తితిదే పరిపాలన మొత్తం కూడా ఆయన చేతుల సాగాలనేది ఛైర్మన్‌ ఉద్దేశం. గత కొన్నినెలల వరకు తితిదే ఈఓకు ప్రాధాన్యత ఇచ్చిన ఛైర్మన్‌ ఇప్పుడు నేను చెప్పిందే జరగాలంటున్నారట. దీంతో ఈఓ సాంబశివరావు కూడా సైలెంట్‌ అయిపోయారట. మొత్తం మీద తితిదేలో ఛైర్మన్‌ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి