నేడు రథసప్తమి: ఏర్పాట్లన్నీ పూర్తి

బుధవారం, 13 ఫిబ్రవరి 2008 (09:43 IST)
రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతున్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామికి ఏటా నిర్వహించే రథసప్తమి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం దేవస్థాన కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కుంభ సంక్రమణం, రథసప్తమి రెండు ఒకే రోజు రావడంతో ఈ ఏడాది రథసప్తమికి ఎనలేని ప్రాధాన్యం వచ్చిందని వేదపండితులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా... మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు సూర్య నారాయ్వణసామికి క్షీరాభిషేకం నిర్వహిస్తారు.

రథసప్తమి రోజున భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా ఉండేందుకు వీలుగా దేవస్థానం, పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అవసరమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆర్‌టిసి కూడా విశాఖపట్నం నుంచి అరసవల్లి వరకు, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడుపనుంది.

శ్రీవారి సప్తవాహన వైభవం
ఈ రథసప్తమి పండుగ సందర్భంగా.. శ్రీవారు బుధవారం ఏడు వాహనాలపై భక్తులకు కనువిందుగా దర్శనమివ్వనున్నాడు. సూర్య మండలంలో నారాయణుడు కొలువైనందున వైష్ణవాలయాలలో రథసప్తమిని విశేష ఉత్సవంగా నిర్వహిస్తారు. ఏటా మాఘశుద్ధ సప్తమిన ఈ వేడుక నిర్వహించడం ఆనవాయితీ. ఆ రోజున శ్రీవారి వైభవం సూర్యప్రభ వాహనంతో మొదలవుతుంది.

వెబ్దునియా పై చదవండి