హరహర మహాదేవ శంభో శంకర!

సృష్టి లయకారుడైన శివునికి అత్యంత ప్రీతపాత్రమైన ఈ రోజు ఆ పరమేశ్వరుని భక్తితో పూజించాలి. ఆ భోళాశంకరుని అభిషేకించి, లక్షబిల్వ పత్రాలతో పూజించి, శివనామస్మరణ చేస్తూ జాగరణ చేయటం వల్ల శుభం కలుగుతుందని భక్తుల విశ్వాసం.

అడిగినవారికి, అడిగినంత ఇచ్చే బోళాశంకరుడు గరళాన్ని మింగి, లోకాన్ని రక్షించాడు. తాను శ్మశానవాసిగా భిక్షాటన చేస్తూ, భక్తులకు సకలైశ్వరముల నిచ్చే భక్తజన సులభుడు పరమశివుడు. అసలు 'శివం' అంటేనే 'మంగళం' లేక ''కల్యాణం అని అర్థం. పరమేశ్వరుడు మంగళస్వరూపుడు అని అర్థం.

ఆదిశంకరుడి ఆవిర్భావం:
బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి తమ తమ గొప్పదనాలను గురించి వాదులాడుకుంటున్న సమయం. సృష్టిస్థితి, కారకులైన వారిద్దరూ అలా వాదులాడుకోవడం, వారిపై ఆవహించివున్న 'మాయ'ను తొలగించేందుకు 'మాయి' అయిన మహేశ్వరుడు పూనుకోక తప్పలేదు. పరస్పర ఆధిక్యతను నిరూపించుకునేందుకు బ్రహ్మా పశుపతాస్త్రాన్ని, విష్ణువు ఈశ్వర సంప్రాప్తించిన అస్త్రాన్ని సంధించుకునే సమయంలో ఆదిశంకరుడు అఖండాగ్ని స్తంభంగా ఆవిర్భవించి ఆ అస్త్రాలను తనలో లీనం చేసుకున్నాడు.

శివుని పూజ - వాడదగిన వస్తువులు:
శివుని పూజకు మారేడు, తుమ్మి, జిల్లేడు పువ్వులు, గన్నేరు, ఉత్తరేణి, జమ్మి ఆకులు, నల్లకలువ దళాలు, ఉమ్మెత్త పుష్పము, నల్ల కలువలు వాడాలి. వీటితో పరమేశ్వరుని పూజిస్తే సంతృప్తి చెందుతాడు. అయితే ఇవి దొరకని వారు భక్తితో ఒక పండును గానీ అవీ దొరకకపోతే పత్రాలు లేదా అక్షతలు గానీ, నీళ్లు గానీ వాడాలని పూజించవచ్చు.

వెబ్దునియా పై చదవండి