నవరాత్రుల పండుగ దసరా పండుగ

దసరా... అంటేనే అందరికీ గుర్తుకు వచ్చేవి నవరాత్రులే. తొమ్మిది రోజుల పాటు అతి వైభవంగా ఉత్సవాలు జరిగే ఈ పండుగ శరత్ ఋతువులో వస్తుంది. అందుకే ఈ నవరాత్రులను శరన్నవరాత్రులని కూడా అంటారు. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు తొమ్మిది అవతారాలలో భక్తులకు దర్శనమిస్తారు.

మన దేశంలో కోల్‌కతా కాళీ ఉత్సవాలు ప్రసిద్ధి చెందినవి. ఇక్కడి అమ్మవారు నిజమైన కాళిని తలపించేలా ఉంటుంది. తొమ్మిది రోజుల పాటు వివిధ రకాల బొమ్మలతో కొలువు ఏర్పాటు చేసి పేరంటాలు నిర్వహించడం ఈ పండుగ మరో ప్రత్యేకత. హిందూ కుటుంబాలు ఈ నవరాత్రులను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటాయి.

పూర్వం మహిషాసరుడనే రాక్షసుడు ఉండేవాడు. వాడు బ్రహ్మకోసం కఠోరమైన తపస్సు చేసి ఎవరివల్లా చావు లేని వరం పొందాడు. దీంతో అహంకారపూరితుడైన మహిషాసరుడు దేవతలను, మునులను బాధించేవాడు. మహిషుని బాధలు తాళలేని దేవతలు విష్ణువు వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, అతని వరం గురించి తెలిసిన విష్ణుమూర్తి దుర్గామాత వానిని సంహరిస్తుందని చెప్పాడు.

సకల దేవతల ఇచ్చిన ఆయుధాలతో జనించిన దుర్గా దేవి మహిషాసురునితో పది రోజుల పాటు యుద్ధం చేసింది. యుద్ధ కాలంలో తొమ్మిది రోజులు ఒక్కో అవతారమెత్తి వాడిని సంహరించింది. పదో రోజున మాత విజయం సాధించినందుకు గుర్తుగా ఆ రోజున భూలోకవాసులు ఆనందంతో విజయ దశమి వేడుకలు జరుపుకున్నారు. అలా ఆరోజునుంచి విజయ దశమి వేడుకలను మనం జరుపుకుంటున్నాము.

వెబ్దునియా పై చదవండి