దుర్గాష్టమి శనివారమే: ఎర్రటి పట్టు వస్త్రాలు ధరించండి!

FILE
మహిషాసురుడిని అంతమొందించే సమయంలో కాళికా మాత ఎత్తిన అవతారాలలో దుర్గాదేవి అవతారం ముఖ్యమైనది. శరన్నవరాత్రుల్లో ఎనిమిదో రోజు అష్టమి నాడు మాత దుర్గ అవతారంతో మహిషాసురుడితో భీకరమైన యుద్ధం చేసింది. ఆ రోజు అమ్మవారికి దుర్గాదేవి అవతారం వేసి విశేష పూజలు నిర్వహిస్తారు.

అందుకే అష్టమి నాడు ఉదయం ఐదు గంటలకే నిద్రలేచి పూజామందిరం, ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత గడపకు పసుపు, కుంకుమలు పూసి, గడపను మామిడి తోరణాలతో అలంకరించి పూజామందిరములో ముగ్గులు పెట్టాలి. తలస్నానమాచరించి ఎర్రటి పట్టు వస్త్రాలను ధరించాలి. మందిరంలో ఎర్రటి వస్త్రమును, కలశముపై ఎర్ర రంగు రవికను అలంకరించాలి.

సింహాన్ని వాహనంగా కలిగిన దుర్గాదేవి ప్రతిమ, ఫొటోలను పూజించాలి. అమ్మవారి పూజకు ఎర్రటి అక్షితలు, ఎర్రరంగు పువ్వులను ఉపయోగించాలి. అంతేకాదు పొగడ పువ్వులను కూడా సిద్ధం చేసుకోవాలి. నైవేద్యం కోసం పొంగలి, పులిహోరలను సిద్ధం చేసుకోవాలి. పండ్లలో ఎర్రని దానిమ్మ పండ్లను నైవేద్యం పెట్టాలి.

తర్వాత దుర్గాదేవీ అష్టోత్తరం, దుర్గాద్వాదశిత్రిశంనన్నామాలు, అర్జునకృత దుర్గాస్త్రోత్రాలు పారాయణం చేయవలెను. దుర్గాసహస్రనామము, దేవీ భాగవతము, మహిషాసుర సంహారము తదితరాలను పారాయణం చేయాలి. తర్వాత దుర్గాదేవి ధ్యానమ్, దుర్గాదేవి అష్టోత్తర పూజలు నిర్వహించాలి.

వెబ్దునియా పై చదవండి