తిరుపతి వెంకన్న లడ్డులో నెయ్యి వాసన ఏదీ...? పిసినిగొట్టు టిటిడీ

సోమవారం, 20 జనవరి 2014 (21:43 IST)
FILE
ఇదీ తిరుపతి లడ్డుపై భక్తుల్లో పెల్లుబుకుతున్న ఆగ్రహం. తిరుమలలో అడుగుపెట్టి శ్రీవారిని దర్శించుకునే సమయంలో సుమారు 10 నుంచి 16 గంటలపాటు శ్రీవారిని వీక్షించేందుకు పడిగాపులు కాసే భక్తులకు నెయ్యి వాసనతో ఘుమఘుమలాడే లడ్డూలు ఆకలిని తీర్చి సేద తీరుస్తాయి. అలాంటి లడ్డూల్లో నాణ్యత కరవైంది.

విషయం ఏమంటే, ఇటీవల లడ్డూల్లో ఉపయోగించే నెయ్యి నాణ్యత లోపించిందని భక్తులు అంటున్నారు. వివరం ఏంటయా అని చూస్తే... నెయ్యి ఉత్తరప్రదేశ్ నుంచి వస్తోందట. అదేంటి...? మన రాష్ట్రం, దక్షిణాదిన ఉన్న రాష్ట్రాలను వదిలేసి ఎక్కడో ఉత్తరాదిన ఉన్న రాష్ట్రం నుంచి తెప్పించడమేమిటని అందరూ ప్రశ్నిస్తున్నారు. దీనికి తితిదే ఈవో సమాధానమిచ్చారు. అదేమిటంటే, అక్కడి కంపెనీ ఒకటి అతి తక్కువ ధరకే నెయ్యిని సరఫరా చేస్తామని కొటేషన్ ఇచ్చిందట. దాంతో దాన్నే ఓకే చేసేశారట.

ఐతే భక్తులకు నేతితో ఘుమఘుమలాడే లడ్డూలను అందించే విషయంలో ఎంతమాత్రం ఆలోచన చేసినట్లు కనిపించలేదు. దీంతో యూపీ నుంచి వస్తున్న నేతికి స్వచ్ఛమైన నేతికి ఉండాల్సిన సువాసన లేదట. లడ్డూ తింటుంటే... నేయి నాణ్యమైనది కాకపోవడంతో భక్తులు తితిదేపై ధ్వజమెత్తుతున్నారు.

ఎంతో భక్తితో తిరుపతి వెంకన్న లడ్డూలను ఇంటికి తీసుకెళ్లి ఫలహారం పెడదామని చూస్తే... అది పాడయిపోతోందట. దీంతో భక్తులు తితిదే ఇంత పిసినిగొట్టులా ఎందుకు మారిందంటూ ప్రశ్నిస్తున్నారు. మరి తితిదే ఇప్పటికైనా నాణ్యమైన నేతితో శ్రీవారి ప్రసాదాలను తయారుచేస్తారేమో చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి