అరుదైన జంటరూపం కూర్మనాథ వేణుగోపాలస్వామి

మంగళవారం, 11 అక్టోబరు 2011 (12:25 IST)
File
FILE
శ్రీమహావిష్ణువు యొక్క వేణుగోపాల రూపం మనకెక్కడైనా కనిపిస్తుంది. కూర్మావతార రూపం మాత్రం శ్రీ కూర్మలోనే కనిపిస్తుంది. ఈ రెండు అవతారాల ఏకరూపం ఎక్కడైనా చూశారా! అటువంటి రూపం ఒకటుందని ఎప్పుడైనా విన్నారా? లేదుకదా!

పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని పెదకాపవరం అనే గ్రామంలో నెలకొన్న శ్రీకూర్మనాథ వేణుగోపాలస్వామి ప్రత్యేకత అదే. స్వామివారి ఈ రూపం వెనక కొంత చరిత్ర ఉంది. అది వింటే గాని ఈ సంయుక్తాకార మూర్తి రహస్యం తెలియదు.

16వ శతాబ్దంలో ఆనాటి పాలకులు సస్యసంపన్నమైన పెదకాపవరంలో శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయాన్ని నిర్మించారు. దాదాపు రెండువందల సంవత్సరాలు ఆ వంశంవారే ధర్మకర్తలుగా వ్యవహరించారు.

18వ శతాబ్దం చివరి రోజుల్లో ఆలయ ధర్మకర్తగా కఠారి శేషన్నగారు వ్యవహరించారు. వారు పరమభక్తులు. ఒక శుభ రాత్రివేళ శ్రీ వేణుగోపాలస్వామి శేషన్న గారికి కలలో కనిపించారు. స్వామివారి దివ్య మంగళ రూపం క్రమంగా కూర్మావతారాన్ని సంతరించుకుంది. శేషన్నగారికి కొన్ని సూచనలు చేసింది.

నిద్రలేచిన శేషన్న తన స్వప్న వృత్తాంతాన్ని గ్రామస్థులకు తెలియజేశారు. ఆ రోజు మధ్యాహ్నం అందరూ సమావేశ మయ్యారు. భగవంతుని న్నామ సంకీర్తన ప్రారంభించారు. అందరూ గొంతెత్తి కీర్తించే సమయంలో ఒక గరుడపక్షి ఆకాశంలో కనిపించింది.

భక్తులందరూ లేచి మేళ తాళాలతో ఆ పక్షిని అనుసరించారు. అలా ఒక అరమైలు దూరం పోయాక ఒక మట్టిదిబ్బమీద గరుడపక్షి వాలింది. అందరూ ఆ ప్రదేశాన్ని తవ్వారు. అందులో శేషన్నగారికి స్వప్నంలో దర్శనమిచ్చిన శ్రీకూర్మరూపం కనిపించింది. వారి ఆనందానికి అవధులు లేవు.

ఆ విధంగా ప్రతిష్టంచబడిన శ్రీకూర్మనాథ వేణుగోపాలస్వామి రూపం మరెక్కడా కనిపించదు. ఆనాటి ఉయ్యూరు ఎస్టేట్ జమీందారులు 50 ఎకరాల ఈనాము స్వామికి దానమిచ్చారు. అప్పటినుంచి స్వామివారికి నిత్యోత్సవ పక్షోత్సవాదులైన వేడుకలు మహావైభవంగా జరుగుతూనే ఉన్నాయి. 1925లో కృష్ణాజిల్లా వేలాదిప్రోలు గ్రామస్థులైన కవి పండితులు శ్రీ కందాళై శోభనాద్రి ఆచార్యులవారు ఈ స్వామిని దర్శంచి ఆశువుగా శ్రీకూర్మనాథాష్టకం ఉత్పలమాలలో చెప్పి ధన్యులయ్యారు.

ఇక్కడ స్వామివారికి వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి పూజలు జరుగుతున్నాయి. దేవాదాయశాఖ వారు ఈ మధ్యనే నాలుగు లక్షల వ్యయంతో ముఖమండపం కట్టించారు. శేషన్నగారి వంశీకులైన కఠారి రామకృష్ణగారు ముఖమండపానికి, కల్యాణమండపానికి పాలిష్ రాళ్ళు వేయించారు. సింహద్వారానికి 108 ఇత్తడిదీపాలు పెట్టించారు. నవవిధ భక్తుల్లో దర్శనభక్తిని కోరుకునే భక్తులు ఈ స్వామి దివ్యమంగళరూపాన్ని చూచి తీరవలసిందే!

వెబ్దునియా పై చదవండి