శ్రీనివాసన్‌కు సిగ్గూశరం లేదు : శశాంక్ మనోహర్ ధ్వజం

మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (11:36 IST)
File
FILE
భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు శ్రీనివాసన్ పదవి కోసం వెంపర్లాడుతున్నారని, ఆయనపై అనేక మంది పలు రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నా సుప్రీంకోర్టు అక్షింతలు వేసేంత వరకు నిస్సిగ్గుగా కుర్చీని అంటిపెట్టుకొని కూర్చున్నాడని బోర్డు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ నిప్పులు చెరిగాడు.

ఇదే అంశంపై ఆయన ఒక చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇటీవల చెన్నైలో జరిగిన బోర్డు కార్యవర్గ సమావేశానికి తాను నిర్దిష్టమైన లక్ష్యంగా హాజరయ్యానని చెప్పాడు. గత 8 దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ప్రతిష్ట కోల్పోయిన బోర్డును సమస్యల నుంచి గట్టెక్కించడానికి తన వంతు ప్రయత్నం చేద్దామని అనుకున్నానని చెప్పాడు.

అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో బోర్డు పారదర్శకంగా వ్యవహరిస్తుందని, మంచి సలహాలు, సూచనలను పాటిస్తుందని ఊహించడం భ్రమేనని స్పష్టమైందని అన్నాడు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని, అధ్యక్షుడిగా బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించే వరకూ శ్రీనిలో చలనం రాలేదని విమర్శించారు. అతను అధ్యక్షుడిగా మాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచే బోర్డు పతనం ఆరంభమైందని దుయ్యబట్టారు.

వెబ్దునియా పై చదవండి