శ్రీలంక క్రికెట్ జట్టు కోచ్ పదవికి పాల్ ఫార్‌బ్రేస్ రిజైన్!

బుధవారం, 23 ఏప్రియల్ 2014 (13:43 IST)
File
FILE
శ్రీలంక క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవి నుంచి పాల్ ఫార్‌బ్రేస్ రాజీనామా చేశారు. సొంత దేశమైన ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు సహాయ కోచ్‌గా సేవలు అందించే నిమిత్తం శ్రీలంక క్రికెట్ జట్టు కోచ్ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఫార్‌బ్రేస్ తన నిర్ణయాన్ని మంగళవారం ఉదయం శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సి) కార్యవర్గ కమిటీకి అధికారికంగా తెలియజేశాడని ఎస్‌ఎల్‌సి కార్యదర్శి నిశాంత రణతుంగా వెల్లడించాడు.

స్వదేశీ జట్టుకు సహాయ కోచ్‌గా సేవలు అందించాల్సిందిగా ఫార్‌బ్రేస్‌కు ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) విజ్ఞప్తి చేసినప్పటికీ ఆయన శ్రీలంక జట్టు కోచ్‌గానే కొనసాగుతాడని ఎస్‌ఎల్‌సి సోమవారం ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

శ్రీలంక క్రికెట్ జట్టుకు ఇంతకుముందు సహాయ కోచ్‌గా సేవలు అందించిన ఫార్‌బ్రేస్ గత ఏడాది చివర్లో ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన ట్వంటీ-20 ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్‌తో పాటు, అంతకుముందు ఆసియా కప్ వన్డే టోర్నీలోనూ, అలాగే బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఫార్‌బ్రేస్ శ్రీలంక జట్టును విజయపథంలో నడపడంలో కీలక పాత్ర పోషించారు.

వెబ్దునియా పై చదవండి