హేమాహేమీలు సిద్ధం: యూఎస్ ఓపెన్‌ బరిలోకి టాప్ సీడ్లు!

FILE
ఈ ఏడాది చివరి గ్రాండ్‌శ్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ యుఎస్ ఓపెన్ సోమవారం నుంచి ప్రారంభం కానుండగా, హోరాహోరీ పోరుకు హేమాహేమీలు సిద్ధమవుతున్నారు. ఆర్థర్ అషే కిడ్స్ డేను అమెరికా మొదటి మహిళ మిచెల్ ఒబామా ప్రారంభించడంతో యుఎస్ ఓపెన్ అనధికారంగా మొదలైంది.

పురుషులు, మహిళల విభాగాల్లో డిఫెండింగ్ చాంపియన్లు ఆండీ ముర్రే, సెరెనా విలియమ్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉండగా, ఈసారికి వారికి గట్టిపోటీనివ్వడానికి సీడెడ్ స్టార్లు సమాయత్తమవుతున్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉన్న ముర్రేకు నంబర్‌వన్ ఆటగాడు నొవాక్ జొకొవిచ్, రెండో ర్యాంకర్ రాఫెల్ నాదల్ నుంచి సవాళ్లు తప్పకపోవచ్చు.

గత ఏడాది అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్‌లో జొకొవిచ్‌ను ముర్రే 7-6, 7-5, 2-6, 3-6, 6-2 తేడాతో ఓడించిన సంగతి తెలిసిందే. కెరీర్‌లో 17 గ్రాండ్‌శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న ప్రపంచ మాజీ నంబర్‌వన్ రోజర్ ఫెదరర్ ఇటీవల కాలంలో ఫామ్‌లో లేకపోయినప్పటికీ, అతని ప్రతిభను తక్కువ అంచనా వేయలేం.

2004 నుంచి 2008 వరకు, వరుసగా ఐదు పర్యాయాలు యుఎస్ చాంపియన్‌గా నిలిచిన ఫెదరర్‌ను గాయం సమస్య వేధిస్తున్నది. అతను వెన్నునొప్పితో బాధపడుతున్నాడని, అందుకే ఇటీవల కాలంలో వరుస వైఫల్యాలను చవి చూస్తున్నాడని వినిపిస్తున్న వాదన నిజమేనని టీవల జరిగిన పలు టోర్నీలు స్పష్టం చేశాయి.

పురుషుల విభాగంలో మార్డీ ఫిష్, మహిళల విభాగంలో మరియా షరపోవా, మరియన్ బర్టోలీ ఈ టోర్నీ నుంచి వైదొలిగారు. ఫిష్ ప్రపంచ మాజీ ఏడో ర్యాంక్ ఆటగాడుకాగా, ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో షరపోవా మూడు, బర్టోలీ ఏడు స్థానాల్లో ఉన్నారు.


పురుషుల విభాగంలో ‘టాప్-10’ సీడ్స్
1. నొవాక్ జొకొవిచ్, 2. రాఫెల్ నాదల్, 3. ఆండీ ముర్రే, 4. డేవిడ్ ఫెరర్, 5. తొమాస్ బెర్డిచ్, 6. జువాన్ మార్టిన్ డెల్ పొట్రో, 7. రోజర్ ఫెదరర్, 8. రిచర్డ్ గాస్క్వెట్, 9. స్టానిస్లాస్ వావ్రిన్కా, 10. మిలోస్ రవోనిక్.

మహిళల విభాగంలో ‘టాప్-10’ సీడ్స్
1. సెరెనా విలియమ్స్, 2. విక్టోరియా అజరెన్కా, 3. అగ్నీస్కా రద్వాన్‌స్కా, 4. సారా ఎరానీ, 5. నాలీ, 6. కరొలిన్ వోజ్నియాకి, 7. పెట్రా క్విటోవా, 8. ఏంజెలిక్ కెర్బర్, 9. జెలెనా జన్కొవిచ్, 10. రాబర్టా విన్సీ.

వెబ్దునియా పై చదవండి