నా బెడ్రూమ్‌లోకి వచ్చి.. గొర్రెను ఈడ్చుకెళ్లినట్లు లాక్కెళ్లారు.. రేవంత్ రెడ్డి

మంగళవారం, 4 డిశెంబరు 2018 (18:22 IST)
ఏనాడైనా కొడంగల్ వైపు సీఎం కేసీఆర్ కన్నెత్తి చూశారా? అంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఈసీ ఆదేశాల మేరకు పోలీసులు రేవంత్ నివాసంలో ఆయన్ని అరెస్ట్ చేసి జడ్చర్ల తరలించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డిని మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. 
 
ఇంటికి చేరుకున్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అరాచకాలు సృష్టించి కొడంగల్‌లో టీఆర్ఎస్ గెలవాలని చూస్తోందన్నారు. రూ.150 కోట్ల లావాదేవీలతో కొడంగల్ ప్రజలపై కేసీఆర్ యుద్ధం ప్రకటించారన్నారు. ఎంపీగా, సీఎంగా వున్నప్పుడు కొడంగల్ వైపు కేసీఆర్ కన్నెత్తి కూడా చూడలేదన్నారు. 
 
తెలంగాణలో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి కేసీఆర్ ఎలాంటి పనికైనా సిద్ధపడుతారని.. అరచకాలు, అక్రమాలతో తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. వందలాది మంది పోలీసులు మా ఇంటికొచ్చి.. తనను గొర్రెను ఈడ్చుకెళ్లినట్లు లాక్కెళ్లారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున 3-4 గంటల ప్రాంతంలో తన బెడ్రూమ్‌లోకి పోలీసులు తలుపులు బద్ధలు కొట్టుకుని లోనికి వచ్చారన్నారు.
 
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా పోలీస్ వాహనాల్లోనే నగదు సరఫరా చేసే పరిస్థితి ఏర్పడిందని... ఇలాంటి అరచకాలు నియంత పాలనలో కూడా చూడలేదన్నారు. కేసీఆర్ అరాచకాలను కొడంగల్ ప్రజలు తిప్పికొడతారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. 2009లో కేసీఆర్ ఎంపీ కావడానికి కొడంగల్ ప్రజల పాత్ర వుందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు