నయీం దగ్గర కోట్లు దొబ్బితిన్నది మీరు... సస్పెన్షన్లు మాకా... అన్నీ బయటపెడతామన్న ఏసీపీ
శనివారం, 13 మే 2017 (07:09 IST)
మాజీ నక్సలైట్ నయీమ్‌తో కలసి సెటిల్మెంట్లు చేసి.. సస్పెండైన ఐదుగురు పోలీసు అధికారులలో ఒకరైన ఏసీపీ స్థాయి అధికారి తెలంగాణ ఉన్నత పోలీసు అధికారులకు షాకింగ్ ఝలక్ ఇచ్చారు. నయీమ్ దేశానికి ఎంతో సేవచేశాడని, అతడిని ఉపయోగించుకుని సీనియర్ ఐపీఎస్‌లు కోట్లు గడించారని పేర్కొన్నారు. వారిని వదలి తమపై పడితే.. అసలు విషయాలన్నీ బయటపెడతామని వ్యాఖ్యానించారు. నయీమ్ ఎంతో మంది ఉగ్రవాదులను పట్టించాడని.. అతడి పేరు చెప్పుకుని పదవులు పొందిన రిటైర్డ్, ప్రస్తుత ఐపీఎస్‌లను కూడా విచారించాలని డిమాండ్ చేశారు. అలాగైతే ఆయుధాలు పట్టించిన కేసు, సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు వంటి అనేక సంచలన కేసులు తిరగదోడాల్సి వస్తుందన్నారు.
అంత ధైర్యం ప్రస్తుతమున్న అధికారులకు లేదని, పోలీసు శాఖ పరువు పోతుందనే.. తమపై వేటు వేసి చేతులు దులుపుకొంటున్నారని ఆరోపించారు. సస్పెన్షన్‌కు గురైన అధికారుల్లో ఓ ఏసీపీ స్థాయి అధికారి ఇలా బాహాటంగానే నయీమ్‌ను అతడి దేశభక్తిని పొగడడం గమనార్హం.
కాగా, నయీంతో అంటకాగిన కేసులో సస్పెండైన అధికారులతో పాటు మరో 16 మంది అధికారులపైనా విచారణ ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తమ వద్ద ఈ 16 మందికి సంబంధించి ఉన్న ఆధారాల ప్రకారం చార్జిమోమోలు జారీచేసినట్టు వెల్లడించారు. ఈ మెమోలకు సరైన వివరణ ఇవ్వకపోతే సస్పెన్షన్ వేటు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
నయీమ్ కేసులో ఆయా అధికారులు మూటగట్టుకున్న ఆస్తులు, బినామీ ఆస్తులను తేల్చి క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశముందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. విచారణను బట్టి ఈ తొమ్మిది మంది అధికారులను జైలుకు కూడా పంపే అవకాశముందని, సర్వీసు నుంచి తొలగించేందుకు కూడా కార్యాచరణ సిద్ధమైందని పేర్కొంటున్నాయి.
సస్పెండైన ఐదుగురితో పాటు విచారణ ఎదుర్కొనే మరో నలుగురు అధికారులపై పోలీసు శాఖ నిఘా పెంచింది. ఆదేశాలు వెలువడిన దగ్గరి నుంచి వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, బినామీలుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తులెవరినైనా కలిశారా.. నయీమ్ కేసుల్లో ఉన్న నిందితులెవరైనా కలిశారా అన్న అంశాలను పరిశీలించాల్సిందిగా ఇంటలిజెన్స్ విభాగాన్ని ఉన్నతాధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది.