హైదరాబాద్ ఫిల్మ్ నగర్లో అనుమానాస్పదంగా మృతి చెందిన బ్యూటీషియన్ శిరీషకు, ప్రభాకర్ ఘటనకు సంబంధం ఉందంటూ పోలీసులు చేస్తోన్న ఆరోపణలపై శిరీష భర్త సతీశ్ చంద్ర స్పందించారు. తన భార్య అలాంటిది కాదనీ, కానీ, తన భార్య మృతిపై గంటకో విషయం బయటకు రావడం తనను ఆవేదనకు గురి చేస్తోందని వాపోయారు. ఈ విషయంలో తనకేమీ అర్థం కావడం లేదన్నారు.
కాగా, రెండు రోజుల క్రితం కూడా తన భార్యతో ఫోన్లో మాట్లాడానని, అపుడు కూడా ఆమె సంతోషంగానే మాట్లాడిందని చెప్పారు. తన భార్య మృతిపై విచారణ చేయాలని తాను పోలీసులను కోరుతున్నట్టు చెప్పారు. పోలీసులు చెబుతున్న కుకునూరు ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఎవరో తనకు అసలు తెలియదని అన్నారు. తాను ఆయనతో ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. తన భార్య ఆత్మహత్య చేసుకొనేంత పిరికిది కాదని అన్నారు.