టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సవాల్ విసిరారు. తమ్మిడిహట్టి ఎత్తు 152 మీటర్లకు పెంచేలా మహారాష్ట్రతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి పత్రాలు తెచ్చి చూపిస్తే తాను సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. అంతేకాకుండా, రాజకీయ సన్యాసం కూడా తీసుకుంటానని వెల్లడించారు.
తెలంగాణ బీడు భూముల్లో గోదావరిని పారించేందుకు మహారాష్ట్రతో చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్న సీఎం కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. రాష్ట్రానికి జలసిరులు తీసుకొచ్చిన జననేతకు ప్రజలు ఘన నీరాజనాలు పలికారు. బేగంపేట విమానాశ్రయంలో దిగిన కేసీఆర్‌కు పార్టీ శ్రేణులు, రైతులు అపూర్వ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ కాళేశ్వరం నీళ్లతో ఉత్తర తెలంగాణ రైతుల కాళ్లు కడుగుతానని ప్రకటిచారు.
పంటలు ఎండిపోతుంటే.. గుండెలు తరుక్కుపోతున్నాయనీ, మొగులుకు ముఖం పెట్టి ఎదురుచూసే పరిస్థితి పోవాలన్నారు. కాంగ్రెస్ హయాంలో తమ్మిడిహట్టి వద్ద తట్టెడు మట్టి తవ్వలేదని గుర్తుచేశారు. గతంలో బొట్టు నీటి చుక్క కోసం ఎంతో తపన పడ్డాం కానీ ఇకపై రాష్ట్రంలో వర్షాలు కురిసినా.. కురవపోకపోయినా నీటికి ఇబ్బంది ఉండదన్నారు. జనాల్లో ఇంత సంతోషం చూస్తుంటే.. కాంగ్రెసోళ్లకు మాత్రం నల్ల జెండాలు కనపడుతున్నాయని మండిపడ్డారు.
ఉత్తమ్ కుమార్‌రెడ్డి చెప్పిందే నిజమైతే ఇటు నుంచే రాజ్‌భవన్‌కు పోయి రాజీనామా సమర్పిస్తానని ప్రకటించారు. ఇంకా గంట సేపు బేగంపేటలో ఉంటా.. ఉత్తమ్‌కుమార్ రెడ్డి.. దమ్ముంటే ఆ ఒప్పందం కాగితం తీసుకొని బేగంపేటకు రా. తెలంగాణ పచ్చబడుతుంటే కాంగ్రెస్ కళ్ళలో నిప్పులు పోసుకుంటోంది. ఏ ఒక్క విషయంలో కూడా కాంగ్రెస్ కలిసిరావడం లేదు అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు.