ఒక వైపు మండువేసవి ఏప్రిల్‍నెలలోనే వచ్చేసిందా అనేలా మండుతున్న ఎండలు. కానీ విద్యార్థులను చేపలబండకేసి తోముతున్న విద్యా సంస్థలు. వేలాది పిల్లలు స్కూలు బాట పట్టి ఎర్రటి ఎండలో పడుతున్న వ్యధలు.. ఏమీ చేయలేక నిస్సహాయంగా పిల్లలను ఎండల్లోనే స్కూళ్లకు పంపుతున్న తల్లిదండ్రులు. ఒక తెలుగు దినపత్రిక..విద్యార్థులు పడుతున్న తీవ్ర ఇబ్బందులపై మండుటెండల్లో బాల శిక్ష పేరిట ఒక కథనం ప్రచురించింది. అదేమీ పరిశోధనాత్మక కథనం కాదు. కొన్ని వందల స్కూళ్ల యాజమాన్యాలు పిల్లల క్షేమాన్ని పట్టించుకోకుండా ప్యవహరిస్తున్న వైనాన్ని, ప్రభుత్వం కూడా కనీస సున్నిత స్పందన కూడా లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనాన్ని ఆ పత్రిక ఒక వార్తగా మాత్రమే ప్రచురించి పిల్లల బాధలను ప్రపంచం ముందు పెట్టారు.
అంతే... కొన్ని వేలమంది పిల్లల దురవస్థ గురించి ఎవరు స్పందించాలో వారే స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తక్షణమే స్పందించారు. ఎండలతో బయట తిరిగే పరిస్థితి లేదని, విద్యార్థులను బడికి పంపడం శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. బుధవారం నుంచే సెలవులు ప్రకటించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని ఆదేశించారు. అయితే అప్పటికే పిల్లలు స్కూళ్లకు వెళ్లడంతో గురువారం నుంచి సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు.
విద్యామంత్రి ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ గురువారం నుంచి పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు మేనేజ్‌మెంట్లకు చెందిన పాఠ«శాలలు అమలు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్ వెల్లడించారు. గురుకుల పాఠశాలల్లోనూ కొనసాగుతున్న తరగతుల నిర్వహణను నిలిపివేయాలని సూచించారు. ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని జిల్లాల్లోని డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ స్కూళ్లు కూడా ఈ ఉత్తర్వులు అమలు చేయాలని విద్యాశాఖ పేర్కొంది. వాస్తవానికి షెడ్యూలు ప్రకారం ఈ నెల 22 పాఠశాలలకు ఆఖరు పనిదినం. 23వ తేదీ నుంచి వేసవి సెలవులుగా విద్యాశాఖ పేర్కొంది. అయితే ఎండలు, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు పడుతున్న కష్టాలపై ఆ తెలుగు దినపత్రిక కథనం ప్రచురించడంతో ప్రభుత్వం ముందస్తు సెలవులను ప్రకటించింది. సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే కఠినంగా వ్యహరించనున్నట్లు హైదబారాద్ జిల్లా విద్యాశాఖాధికారి రమేశ్ చెప్పారు.