'బాహుబలి-2' ఫస్ట్ రివ్యూ రిపోర్టు ఇదే... స్టోరీని లీక్ చేసిన సెన్సార్ బోర్డు సభ్యుడు.. కట్టప్ప సీక్రెట్ వెల్లడి
గురువారం, 27 ఏప్రియల్ 2017 (13:56 IST)
యావత్ సినీ ప్రపంచం అమితాసక్తితో ఎదురు చూస్తున్న మూవీ బాహుబలి 2 : ది కంక్లూజన్. ఈ చిత్రం ఫస్ట్ రివ్యూ రిపోర్టు వచ్చేసింది. దీన్ని ఈ చిత్ర ప్రదర్శనకు అనుమతి ధృవీకరణ పత్రం మంజూరు చేసిన సెన్సార్ బోర్డు సభ్యుల్లో ఒకరు వెల్లడించారు. తాజాగా, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడొకరు, 'డీఎన్ఏ' పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
సుమారుగా 3 గంటల పాటు చిత్రం సాగిందని, ఒక్క కట్ కూడా చెప్పకుండా చిత్రాన్ని ఓకే చేశామన్నారు. "ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8" కంటే ఈ చిత్రం బాగుందని, యుద్ధ సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాలకన్నా గొప్పగా ఉన్నాయని తెలిపారు.
ఇక ఈ దశాబ్దపు అతిపెద్ద సినీ ప్రశ్నకు సమాధానం సినిమా చూస్తున్న వారిని ఆశ్చర్య పోయేలా చేస్తుందని, ఆ విషయాన్ని మాత్రం థియేటర్‌లోనే చూసి తెలుసుకోవాలని చెప్పారు. ముఖ్యంగా చిత్రంలో నటించిన హీరోలు ప్రభాస్, రానాలు రెండు నట సింహాల్లా పోటీ పడిన తీరును చూపారని అన్నాడు. కొన్ని సీన్లలో చూస్తున్న ప్రేక్షకులు కంటతడి కూడా పెడతారని అన్నారు.
బాహుబలి మొదటిభాగం కంటే ఎంతో గొప్పగా, మెరుగ్గా ఉందన్నారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే కథనంతో మనకు సమయమే తెలియదు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న విషయాన్ని ప్రేక్షకులకు వదిలేయాలని, ఇది ఆడియన్స్‌ను ఆశ్చర్యచకితులను చేస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఆయన ఈ చిత్రానికి 5 పాయింట్లకు 5 రేటింగ్ పాయింట్లు ఇస్తున్నట్టు తెలిపారు.
ఇకపోతే... సినీ ప్రేక్షకాభిమానులకు అమితాసక్తిని కలిగిస్తున్న చిత్రం, బాహుబలికి చెందిన కీలక సీన్లు ఒక్కొక్కటిగా సోషల్ మీడియాలోకి చిన్న చిన్న వీడియోల రూపంలో ఎక్కేస్తున్నాయి. ఇప్పటికే రానాకు రాజమాత శివగామి స్వయంగా పట్టం కడుతున్న సీన్ చక్కర్లు కొడుతుండగా, ఈ చిత్రానికి చెందిన కథ కూడా ఇప్పుడు బయటకు వచ్చేసింది. సామాజిక మాధ్యమాల్లో ఓ సీక్రెట్ కూడా రివీల్ అయింది.
దేవసేన (అనుష్క) కట్టప్ప కూతురేనట. మొదటి భాగంలో ఎంతమాత్రమూ ప్రస్తావించకుండా వదిలేసి, రెండో భాగంలో రివీల్ చేసిన అతిపెద్ద సీక్రెట్ ఇదేనని కూడా పలువురు పోస్టులను పంచుకుంటున్నారు. ఇక కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న విషయాన్ని కూడా వెల్లడిస్తున్నారు.