మరో బాహుబలి మొదలైంది.. దాని కథా రచయితా రాజమౌళి తండ్రే.. కథ వినగానే పాదాలకు నమస్కరించిన కంగనా

శనివారం, 6 మే 2017 (04:01 IST)
ఆ కథ వినగానే కంగనా రనౌత్ వంటి సంచలన హీరోయిన్ కదిలిపోయింది. ఆనందాన్ని తట్టుకోలేక చాలా సార్లు ఈల వేయాలనిపించీ బాగుండదని ఆగిపోయిందట. కథ విన్న తర్వాత కథా రచయిత విజయేంద్రప్రసాద్ కాళ్లకు నమస్కరించిన కంగనా ఆయన ఆశీస్సులను అందుకుందట. టాలీవుడ్‌లోనే కాదు.. దేశంలో మరో బాహుబలిగా ప్రచారం పొందుతున్న మణికర్ణిక సినిమాను శాతకర్ణి దర్శకుడు క్రిష్ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రాణీ ఝాన్షీ లక్ష్మీబాయి పాత్రను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోషిస్తున్న విషయం తెలిసిందే.
 
విజయేంద్రప్రసాద్ రచించిన మణికర్ణిక పాత్రకు చెందిన 20 అడుగుల భారీ పోస్టర్‌ను ఈ గురువారం వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌లో చిత్ర యూనిట్ ఆవిష్కరించింది. మణికర్ణిక అంటే చాలామందికి తెలియక పోవచ్చు కానీ అది ఝాన్మీ లక్ష్మీబాయి అసలు పేరు. పెళ్లయిన తర్వాతే ఆమె పేరు లక్ష్మీబాయిగా మారింది. ఈ కథ రాయడానికి ప్రేరేపించిన సన్నివేశాన్ని విజయేంద్రప్రసాద్ హృద్యంగా వివరించారు. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కోసం ఝాన్సీ లక్ష్మీబాయి కథ రాయాలని తనను అడిగినప్పుడు ఆ సినిమాకు క్రిష్ డైరెక్టర్ అయితే బాగుంటుందని నేను బలవంతపెట్టాను. క్రిష్‌తో నాకు చక్కటి సాన్నిహిత్యం, అవగాహన ఉన్నాయి. నా కుమార్తె పేరు కూడా మణికర్ణికే అని క్రిష్ చెప్పిన వెంటనే నేను ఆ బావనకు కనెక్ట్ అయిపోయాను అన్నారు విజయేంద్ర ప్రసాద్.
 
దర్శకధీరుడు రాజమౌళి సృష్టించిన దృశ్యకావ్యం. రెండేళ్ల కిత్రం విడుదలైన ‘బాహుబలి ద బిగినింగ్‌’ ఎలాంటి రికార్డులు సృష్టించిందో అందరికీ తెలిసిందే. తాజాగా విడుదలైన ‘బాహుబలి ద కన్‌క్లూజన్‌’ భారతీయ సినీచరిత్ర రికార్డులను తిరగరాస్తోంది. బాహుబలి చిత్రానికి కథ అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌.. క్రిష్‌-కంగనా రనౌత్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘మణికర్ణిక’కు కూడా కథ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వీరనారి ఝాన్సీలక్ష్మీబాయి జీవితగాథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఝాన్సీలక్ష్మీబాయి పాత్రను కంగనా పోషిస్తోంది.
 
రచయిత విజయేంద్రప్రసాద్‌ చెప్పిన మణికర్ణిక కథ కంగనాకు విపరీతంగా నచ్చేసిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. కథ చెప్పినపుడు మంచి అనుభూతి చెందానని, ఆనందాన్ని తట్టుకోలేక చాలాసార్లు ఈల కూడా వేయాలనిపించిందని కంగనా చెప్పింది. ఈ కథ బాహుబలి కంటే తక్కువేం కాదని విజయేంద్రప్రసాద్‌ పేర్కొన్నట్లు ఆమె వెల్లడించింది. అంతేకాకుండా కథ విన్న తరువాత విజయేంద్రప్రసాద్‌ కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు కూడా తీసుకుందట.
 
‘మణికర్ణిక’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను గురువారం సాయంత్రం వారణాసిలో ఆవిష్కరించారు. ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తుండగా.. జీ స్టూడియోస్‌, కమల్‌జైన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 27న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. 
 

వెబ్దునియా పై చదవండి