దాస‌రితో ఉన్న బంధుత్వాన్ని బ‌య‌ట‌పెట్టిన చిరు.. ఏంటో తెలిస్తే షాకే

సోమవారం, 6 మే 2019 (14:46 IST)
ద‌ర్శ‌క‌ర‌త్నదాస‌రి నారాయ‌ణ‌రావు - మెగాస్టార్ చిరంజీవి వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న‌ అనుబంధం తెలిసిందే. అయితే... దాస‌రి జ‌యంతిని 'డైరెక్ట‌ర్స్ డే'గా జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో చిరంజీవి ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌లో చిరంజీవి మాట్లాడుతూ... దాస‌రితో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంతేకాకుండా.. దాస‌రితో ఉన్న బంధుత్వాన్ని బ‌య‌ట‌పెట్టారు చిరు. 
 
ఇంత‌కీ వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న బంధుత్వం ఏంటో తెలిస్తే అవునా... అని షాక్ అవుతారు. చిరు మాట్లాడుతూ... దాసరి నారాయణరావు పుట్టిన రోజుని దర్శకుల దినోత్సవంగా జరుపుకోవడం నిజంగా గొప్ప విషయం. ఓ దర్శకుడికి ఇంతకంటే గొప్ప నివాళి వుండదు. ఇది తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. 24 శాఖలపై మంచి పట్టుతో ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించిన దర్శకులు దాసరి. నాటక రచయితగా, రచయితగా, దర్శకుడిగా తనదైన ముద్ర వేసిన వ్యక్తి. దాసరి లాంటి వ్యక్తి మరొకరు లేరు... ఇక రారు. 
 
ఆయనతో కలిసి పని చేసింది ఒకే ఒక్క సినిమా లంకేశ్వరుడు. ఆయనతో నాకు అనుబంధం చాలా తక్కువ. రాఘవేంద్రరావుతో అత్యధికంగా చిత్రాలు చేశాను. దాసరితో ఎక్కువ చిత్రాలు ఎందుకు చేయలేకపోయానా అని బాధపడేవాడిని. ఆయన చాలా సందర్భాల్లో నన్ను మనవడిగా సంబోధించారు. అందరికి తెలియని విషయం ఒకటి వుంది. మా ఇద్దరికి చుట్టరికం వుంది. వరుసకు దాసరి, నేను తాతా మనవళ్లం అవుతాం అంటూ వీరిద్ద‌రి మ‌ధ్య ఉన్న బంధుత్వం బ‌య‌ట‌పెట్టి షాక్ ఇచ్చారు. 
 
చివరి రోజుల్లో మా ఇద్దరి మధ్య బంధం బలపడింది. ఖైదీ నంబర్ 150 వేడుక విజయవాడలో జరిగినప్పుడు ఆయన అతిథిగా వచ్చి ఆశీర్వదించారు. ఓ రోజు పాలకొల్లు నుంచి బొమ్మిడాయిలు తెప్పించానని ఇంటికి వచ్చి భోజనం చేయాలని ఫోన్ చేసి భోజనం పెట్టారు. అల్లు రామలింగయ్య అవార్డుని ఆయన ఇంటికి వెళ్లి నా చేతులతో అందించి వచ్చాను. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా గొప్ప దర్శకులున్నారు. వాళ్లలో దాసరి శైలి ప్రత్యేకం. ఎంతమంది గొప్ప దర్శకులున్నా దాసరిని మించిన దర్శకులు లేరు... ఇక రారు అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు