హీరోల మైండ్‌సెట్ మారుతోంది... 'ధృవ'తో రామ్ చరణ్ అదే చేశాడు...
మంగళవారం, 27 డిశెంబరు 2016 (19:02 IST)
తెలుగు సినిమా ఈ ఏడాది కొత్త పుంతలు తొక్కింది. అగ్రహీరోల చిత్రాలకంటే కొత్తగా పరిచయమైన దర్శకులు, నటులు ఆదరణ పొందారు. అగ్రహీరోల చిత్రాల్లో కూడా సీరియస్ కంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కే పెద్దపీట వేశారు. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా.. కథలు మాత్రం ఇద్దరికీ నచ్చేవిగా తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా రొటీన్ చిత్రాలను ప్రేక్షకులు గండికొట్టారు. దాంతో కొత్త జోనర్ అంటూ.. థ్రిల్లర్ చిత్రాలు వచ్చాయి. దానితోపాటు దెయ్యం కాన్సెప్ట్‌లు ముందుకు వచ్చాయి. ఈ ఏడాది హీరోల సక్సెస్‌లు కొంతమేరకే దక్కాయి.
రొటీన్‌కు బ్రేక్
రొటీన్‌గా హీరో చాచిపెట్టి గుద్దితే పదిమంది ఎగిరిపడాలి. ఇలాంటివి నవ్వుకోవడానికి బాగుంటాయి. అందుకే చాలా చిత్రాల్లో అవి పెద్దగా కన్పించలేదు. నేచురల్‌గా వుండే యాక్షన్ చిత్రాలను హీరోలు చేశారు. అయితే ఒక హీరో ఇద్దరు లేదా ముగ్గురు నాయికలు వుండాల్సిందే అనే రూలు మాత్రం పెట్టుకున్నారు. కథలకు ఫ్లాష్‌బ్యాక్‌లు.. బోలెడంత హంగామాలతో ముందుకు వచ్చారు. ముఖ్యంగా మాస్ హీరో అనే కిరీటం సొంతం చేసుకోవడానికి పడే తపన ఇదంతా. పనిలోపనిగా కథల్లో కొత్తదనం దొరక్క పలువురు పొరుగు భాషల్లో సిద్ధమైన కథలు తెరకెక్కించారు. దాంతో కొన్నిసార్లు కొత్త కథల పేరుతో అన్వేషం చేస్తూ.. థ్రిల్లర్ కథలే సేఫ్‌గా భావిస్తున్నాయి. మొదట్లో చిన్న సినిమాలకే పరిమితమైన థ్రిల్లర్ కాన్సెప్ట్‌లు స్టార్ హీరోల స్థాయికి వచ్చేసింది. ప్రేక్షకులు వీటినే మెచ్చుకుంటున్నారు కాబట్టి అవే నచ్చినవి తీస్తున్నామంటూ చెబుతున్నారు. పైగా మూసధోరణిలో తెలుగు సినిమా వెళుతుందనే విమర్శలూ వున్నాయి.
ఎన్‌టిఆర్‌కు రెండు హిట్లు
రెండేళ్లనాడు దర్శకుడు సుకుమార్ మహేష్ బాబుతో '1' అనే చిత్రం చేశాక ఆ చిత్రం నచ్చి ఎన్‌టిఆర్ ముందుకు వచ్చాడు. దాంతో 'నాన్నకు ప్రేమతో' చేశాడు. సెంటిమెంట్ డ్రామాతో గట్టెక్కింది. ఆ తర్వాత మోహన్‌లాల్ ప్రధాన పాత్రతో 'జనతా గ్యారేజ్' చేయడంతో అదికూడా ఫర్వాలేదనిపించింది. ఎన్‌టిఆర్‌కు ఈ ఏడాది రెండు హిట్లు ఇచ్చింది.
వెంకటేష్‌కు.. బాబు బంగారం అనే సినిమా ఫర్వాలేదు అనిపించేలా చేసింది. మారుతీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇద్దరికీ సేఫ్ ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఇక రామ్‌చరణ్ 'బ్రూస్ లీ' తర్వాత ఏం సినిమా చేస్తాడనే అందరూ అనుకుంటుండగా స్వంత కథలు చేయడానికి జంకాడనే చెప్పాలి. దాంతో సురేందర్ రెడ్డి తీసుకువచ్చిన కథను కాదని బలవంతంగా తమిళ చిత్రాన్ని చూపించి ఆయనచేత దర్శకత్వం చేయించాడు. 'తని ఒరువన్' చిత్రాన్ని 'ధృవ'గా రీమేక్ చేశాడు. ఐపీఎస్‌కీ, శాస్త్రవేత్త మధ్య జరిగే మైండ్ గేమ్ ఇది. ఇందులో అరవింద్ స్వామి విలన్‌గా మంచి మార్కులు సంపాదించారు.
ఇక వర్మ.. కిల్లింగ్ వీరప్పన్ ఏడాది ప్రేక్షకుల్ని అలరించిన థ్రిల్లర్ జబాతాలో చేరింది. 'క్షణం' సినిమా కూడా థ్రిల్లర్ కథే. ఇక నిఖిల్‌కు మంచి హిట్ దక్కించింది 'ఎక్కడికి పోతావ్ చిన్నవాడా'. నోట్ల రద్దు ఎఫెక్ట్ వున్నా... మంచి కలెక్షన్లతో కళకళలాడింది. ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలు పొందంది. నాని కథానాయకుడిగా 'జెంటిల్‌మన్' బాగానే పేరు వచ్చింది. సూర్య '24', కార్తీ 'కాష్మోరా' తమన్నా 'అభినేత్రి'.. థ్రిల్‌కు గురిచేసిన చిత్రాలే. కానీ వసూళ్లు దక్కలేదు. గురి తప్పాయి.
మంచు విష్ణు, రాజ్ తరుణ్‌లు కలిసి 'ఈడో రకం ఆడోరకం' అంటూ ముందుకు వచ్చారు. ద్వంద్వార్థాలు కాన్సెప్ట్ కావడంతో ఒకరకమైన ప్రేక్షకులు ఆదరణ పొందింది. నాగార్జునకు 'ఊపిరి' కొత్త ఉత్సాహాన్ని ఇస్తే, అక్కినేని నాగచైతన్యకు 'ప్రేమమ్' సినిమా మంచి ఉత్సాహాన్నిచ్చింది. అల్లరి నరేష్‌కు 'సెల్ఫీరాజా' అనుకున్నంత పేరు రాలేదు. నారా రోహిత్ 'తుంటరి' పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. బెల్లంకొండ సురేష్ తన కుమారుడుతో చేసిన 'స్పీడున్నోడు' పెట్టిన పెట్టుబడి రాకపోయినా.. మంచి పేరు వచ్చింది.
సుమంత్ అశ్విన్, ప్రభాకర్ నటించిన 'రైట్‌రైట్'కు ఎవ్వరూ స్పందించలేదు. పనిలోపనిగా కామెడీ పాత్రలు పోషిస్తూ... శ్రీనివాసరెడ్డి చేసిన 'జయమ్ము నిశ్చయంబురా..' చిత్రానికి మంచి పేరు వచ్చినా పెద్దగా కలెక్షన్లు రాలేదు. కానీ.. మరో కమేడియన్ సప్తగిరి చేసిన 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్' మాత్రం మంచి కలెక్షన్లను రాబట్టుకుంది. నోట్ల రద్దు ఎఫెక్ట్‌ను ఎదుర్కొని నిలిచిన చిత్రంగా ఈ ఏడాది చివరలో దీన్ని చెప్పుకోవచ్చు.
ఈసారి అనుకున్నంత సక్సెస్ హీరోలకు పెద్దగా లేదు. ఎక్కువగా థ్రిల్లర్ చిత్రాలపై అందరూ ఇంట్రెస్ట్ చూపడం విశేషం. థ్రిల్లర్ చిత్రాలు కొత్తకాదు. అవే కళ్లు, అభిలాష, అన్వేషణ... వంటి చిత్రాలు చాలానే వచ్చాయి. ఈమధ్యలో హీరోయిజం చిత్రాలు వచ్చేవి. ఇప్పుడు రెండింటిని సమన్వయం చేసే కథలు వస్తున్నాయి. దీంతో కొత్త జోనర్ ఏర్పడింది. కథలో థ్రిల్ అవకాశాలున్నా.. దర్శకుల అనుభవరాహిత్యం బెడిసికొడుతుంది.
'లచ్చిందేవికి ఓ లెక్కుంది', సందీప్ కిషన్ చేసిన 'రన్', ఒక్క అమ్మాయి తప్ప, 'అంతం', 'ఇద్దరం', 'దృశ్యకావ్యం', అరకు రోడ్‌లో, బొమ్మల రామారం వంటి చిత్రాలు అనుకున్నంత ఆడలేదు. కాగా, ఏ చిత్రం హిట్ అవుతుందో ముందుగా చెప్పడం కష్టం కనుక చేసుకుంటూ పోవడమే అన్నట్లు హీరోలు నిర్ణయించుకున్నారు. అయితే కథలు వినూత్నంగా వుండాలని ఆలోచించుకున్నట్లు మాత్రం ప్రతి హీరో చెబుతున్నారు. ఇటీవలే 'ధృవ' చిత్రం తర్వాత రామ్ చరణ్.. తాను చేయబోయే కొత్తం చిత్రం తెలుగు సినిమాను కొత్తదారిని చూపెట్టనుందని వ్యాఖ్యానించాడు. అది ఎలా అనేది చిత్రం చూసి తెలుసుకోవాల్సిందే అంటున్నాడు.