'బాల బాబాయ్' అనే పిలుపు ఇక వినబడదు... తారకరత్న మృతిపై బాలయ్య ఆవేదన

ఆదివారం, 19 ఫిబ్రవరి 2023 (08:59 IST)
'బాల బాబాయ్' అంటూ ఆప్యాయంగా పిలిచే పిలుపు ఇక వినబడదని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. గుండెపోటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన తన అన్న మోహనకృష్ణ కుమారుడు, హీరో నందమూరి తారకరత్న శనివారం రాత్రి బెంగుళూరు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెల్సిందే. ఈ వార్త తెలిసిన తర్వాత హీరో బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. తారకరత్న పిలుపును గుర్తు చేసుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే పిలుపు ఇక వినబడదన్న ఊహను కూడా తట్టుకోలేక పోతున్నట్టు చెప్పారు. తారకరత్న మృతి తమ కుటుంబానికి, నందమూరి అభిమానులకు తీరని లోటని ఆయన వ్యాఖ్యానించారు. 
 
తారకరత్న మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అన్నారు. అలాగే, ఆయన నటనలోనూ తనను తాను నిరూపించుకున్నారని చెప్పారు. గుండెపోటుకు గురైన తర్వాత 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడుతూ వచ్చారని, ఆయన కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారని భావించామని, కానీ విధి మరొకటి తలిచి తన బిడ్డను తీసుకెళ్లిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని బాలకృష్ణ పేర్కొన్నారు. 
 
మరోవైపు, తారకరత్న మృతితో తెలుగు చిత్రపరిశ్రమలో విషాదచాయలు అలముకున్నాయి. మృతివార్త తెలియగాే పలువురు సినీ హీరోలు, నటులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. హీరో అల్లు అర్జున్ స్పందిస్తూ, తారకరత్న మృతి వార్త తెలిసి గుండె పగిలినంత పనైందన్నారు. చిన్న వయస్సులోనే ఆయన దూరం కావడం మనసు కలిచివేస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు