విశ్వనటుడు కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహిళలపై పెరిగిపోతున్న అత్యాచారాలపై మీ స్పందనేంటి అని ఓ తమిళ టీవీ విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన తనదైనశైలిలో సమాధానమిచ్చారు. ఈ ప్రశ్నకు ఆయన బదులిస్తూ మహాభారతంలో మగువలను ఫణంగా పెట్టి జూదమాడినట్లు చదివిన ప్రజలున్న ప్రాంతమిది. కనుక ఇలాంటి సంఘటనలు జరుగుతుండటానికి ఆశ్చర్యపోనక్కర్లేదని ఎద్దేవా చేశారు.
ఈ వ్యాఖ్యలపై హిందూ సంస్థలు ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. అంతలో హిందూమక్కళ్ కట్చి కార్యకర్త ఆదినాదసుందరం (31) అనే వ్యక్తి కోర్టులో ఓ పిటీషన్ దాఖలు చేశారు. కమల్ హాసన్ చేసిన ఈ వ్యాఖ్యలు భారతీయులు పంచమవేదంగా భావిస్తున్న మహాభారతానికి కళంకం తెచ్చేవిధంగా ఉన్నాయని, నాస్తికవాదిగా ఉంటూ కమల్ చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని, ఆయనపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు. ఈ పిటీషనను న్యాయమూర్తి సెంథిల్‌కుమార్ విచారణకు స్వీకరించారు.