ఆ కథనాలతో పరువుపోతోంది.. కాస్త ఆపించండి.. హైకోర్టుకు రకుల్ ప్రీత్- video

గురువారం, 17 సెప్టెంబరు 2020 (13:23 IST)
డ్రగ్స్ వ్యవహారంలో తనపై వస్తున్న కథనాలతో పరువు పోతోందని, ఆ కథనాలను నిలుపుదల చేసేలే ఆదేశాలు జారీ చేయాలంటూ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు వార్తలు ప్రసారం కాకుండా సమాచారశాఖకు ఆదేశాలివ్వాలని రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పిటిషన్‌లో కోర్టును కోరింది. 
 
బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసులో బాలీవుడ్‌లో డ్రగ్స్‌ మాఫియా లీలలు బహిర్గతమైన విషయం తెల్సిందే. దీంతో బాలీవుడ్ నటి రియా చక్రవర్తితో పాటు మరికొందరిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసింది. అలాగే, ఎన్సీబీ అధికారుల విచార‌ణ‌లో సుమారు 25 మంది బాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్‌ వ్యవహారంతో సంబంధం ఉందని రియా విచారణలో తెలిపినట్లు వార్తలు వచ్చాయి. 
 
ఇందులో రకుల్‌ ప్రీత్‌సింగ్‌, బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ కూతురు సారా అలీఖాన్‌ తనతో కలిసి డ్రగ్స్‌ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అలాగే రియా విచారణలో ఎవరి పేర్లు చెప్పలేదని వార్తలు వచ్చాయి. మరోసారి విచారణలో పేర్లు చెప్పిందని, ఇందులో రకుల్‌, సారా పేర్లు ఉన్నాయని మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. 
 
దీంతో రకుల్ ప్రీత్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, ఆమె పిటిషన్‌ను జస్టిస్‌ నవీన్‌ చావ్లా ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మీడియాలో ప్రసారాలపై సుప్రీంకోర్టు స్పందించిందని పేర్కొంది. మీడియాకు స్వీయ నియంత్రణ ఉండాలని చెప్పిందని జస్టిస్‌ నవీన్‌ చావ్లా వ్యాఖ్యానించారు. 
 
ఈ మేరకు సమాధానం ఇవ్వాలని సమాచార, ప్రసారశాఖ, ప్రసార భారతి, ఎన్‌బీఏ, ప్రెస్‌కౌన్సిల్‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే స్వీయ నియంత్రణ పాటించాలని హైకోర్టు మీడియా సంస్థలకు సూచించింది. పిటిషన్‌ను ఫిర్యాదుగా పరిగణించి ఆయా శాఖలు చర్యలు తీసుకోవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు