నిర్మాతలు వృధా ఖర్చులు తగ్గించాలి. టి.సుబ్బిరామిరెడ్డి

సోమవారం, 12 అక్టోబరు 2015 (13:40 IST)
పెదబాబు, ఆర్య, అతడు, ఆంధ్రుడు, లెజెండ్.. ఇలా సుమారు 45 చిత్రాలలో బాలనటుడుగా ప్రేక్షకుల అభిమానం చూరగొన్న నటుడు దీపక్ సరోజ్. ఈ యువకుడు కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'వందనం'. సేవ్ లవ్.. అనేది ఉపశీర్షిక. మాళవిక మీనన్ కథానాయిక. కోటపాటి శ్రీను దర్శకత్వం వహించారు. కందిమళ్ళ మూవీ మేకర్స్ పతాకంపై కందిమళ్ళ వెంకట చంద్రశేఖర్ చిత్రాన్ని నిర్మించారు. జె.పి. సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో శనివారం రాత్రి విడుదలయింది. కళాబంధు టి.సుబ్బిరామిరెడ్డి ఆడియో సీడీలను ఆవిష్కరించి మొదటి సీడీను జయప్రదకు అందజేశారు. జయప్రద థ్రియేట్రికల్ ట్రైలర్ విడుదల చేశారు. 
 
టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ.. "సినిమా నిర్మాణం కళాత్మకమైనా వ్యాపారమే. కోట్ల రూపాయలు ఖర్చు చేసేటప్పుడు వ్యాపారం జాగ్రత్తగా చేయాలి. నిర్మాతలు వృధా ఖర్చులు తగ్గించాలి. ఈ సినిమా చూస్తుంటే 15కోట్లు ఖర్చుపెట్టి తీసినట్టు ఉంది. లో బడ్జెట్ సినిమా నిర్మాతలు దీన్ని మార్గదర్శిగా తీసుకోవాలి. దీపక్ తల్లిదండ్రులు నాకు బాగా పరిచయం. ట్రైలర్ చూశాం. అద్బుతంగా నటించాడు. అతడికి ఉజ్వల భవిషత్ ఉంటుంది. పాటలు, సాహిత్యం బాగున్నాయి. నిర్మాతలు మంచి చిత్రం తీశారు. తప్పకుండా విజయవంతం అవుతుంది" అన్నారు.           
  
జయప్రద మాట్లాడుతూ.. "ట్రైలర్, పాటలు బాగున్నాయి. చిన్న సినిమాలకు ఇదొక ట్రెండ్ సెట్టర్ కావాలని ఆశిస్తున్నాను. దీపక్‌లో సహజసిద్దమైన ప్రతిభ దాగుంది. దాన్ని గమనించిన తల్లిదండ్రులు నటనలో ప్రోత్సహించారు. వాళ్లను అభినందిస్తున్నాను. నటిస్తూ, చావుకోవాలనే దీపక్ నిర్ణయం నాకు బాగా నచ్చింది. బిబియం చదువుతున్నాడు. ప్రేమపై ఎన్ని సినిమాలు వచ్చినా అంతు లేదు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుతున్నాను" అన్నారు.   
 
ఎం.ఎల్.కుమార్ చౌదరి మాట్లాడుతూ.. "మా సంస్థ నిర్మించిన 'పెదబాబు'తో బాలనటుడిగా పరిచయమయ్యాడు. తర్వాత 'ఆంధ్రుడు'లో నటించాడు. రెండు చిత్రాలు వంద రోజులు ఆడాయి. ప్రతిభ ఉన్న కుర్రాడు. మంచి కుటుంబం నుంచి వచ్చాడు. హీరోగా వస్తున్న ఈ చిత్రం కూడా వందరోజులు ఆడి సూపర్ డూపర్ హిట్ కావాలి" అన్నారు. 
 
సుమన్ మాట్లాడుతూ.. "దీపక్ టాలెంట్ మనం చూశాం. కమర్షియల్ విజయం సాధించడానికి కావలసిన అన్ని హంగులు చిత్రంలో ఉన్నాయి. మంచి కథ, నేను ఓ పాత్రలో నటించాల్సింది. డేట్స్ సమస్య వలన కుదరలేదు. ట్రైలర్, సాంగ్స్ బాగున్నాయి. ఎక్కడా వల్గారిటీ లేదు. చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుంది" అన్నారు. 
 
దీపక్ మాట్లాడుతూ.. "సత్యానంద్ గారి మొదట బాల శిష్యుడిని నేనే. దిల్ రాజు, ఎం.ఎల్.కుమార్ చౌదరి మొదట ఎంతో ప్రోత్సహించారు. పెదబాబు, ఆర్య చిత్రాలతో గుర్తింపు వచ్చింది. లెజెండ్, మిణుగురులు గొప్ప పేరును తెచ్చిపెట్టాయి. ఈ చిత్రంలో, కథలో నేను హీరో తప్పితే, హీరోగా భావించడం లేదు. నటుడిగా ఉండాలనుకుంటున్నా. లెజెండ్ కు సీక్వెల్ గా ఉంటుందీ చిత్రం. పాత్రకు న్యాయం చేశానని భావిస్తున్నా" అన్నారు. "మంచి సంగీతం కుదిరింది. ప్రేమకథకు అవసరమైన రీతిలో దర్శకుడు పాటలు, సాహిత్యం చేయించుకున్నారు" అని సంగీత దర్శకుడు జె.పి. అన్నారు.

వెబ్దునియా పై చదవండి