ఇంటిలిజెంట్ మూవీ "బ్రదర్స్"... సూర్య యాక్టింగ్ అదుర్స్
శుక్రవారం, 12 అక్టోబరు 2012 (16:09 IST)
WD
ఉన్నత పదవులకు పరీక్షలు ఉన్నతంగా ఉంటాయి. ఒక వస్తువును చూపించి దీనిలో నీకేం కన్పిస్తుంది అని అడుగుతారు. అభ్యర్థుల నుంచి ఒక్కో రకమైన సమాధానం వస్తుంది. అందులో తెలివితేటలతో సింపుల్‌గా విశదీకరించేవారే ఇంటిలిజెంట్ అనేది లెక్క. సినిమాలు కూడా అంత ఇంటిలిజెంట్‌గా తీయవచ్చని నిరూపించిన కొందరి దర్శకుల్లో జర్నలిస్టు ఫొటోగ్రాఫర్ వృత్తి నుంచి దర్శకుడు అయిన కె.వి. ఆనంద్ ఒకరు.
రాజకీయాలపై చాలా చిత్రాలు వచ్చాయి. అసలు రాజకీయ చిత్రమంటే ఇది అంటూ తమిళంలో తీసిన చిత్రాన్ని తెలుగులో 'రంగం'గా చూపించి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు తాజా ప్రయత్నం 'మాట్రాన్'. దాన్ని తెలుగులో 'బ్రదర్స్'గా అనువదించారు. విశేషం ఏమంటే. సూర్య తొలిసారిగా తనే డబ్బింగ్ చెప్పుకోవడం. మరో సూర్య పాత్రకు ఆయన సోదరుడు కార్తీ డబ్బింగ్ చెప్పడం విశేషం.
కథలోకి వెళితే... జనెటిక్ ఇంజనీరైన రామచంద్ర (సచిన్ కడేకర్) తను చేసిన ప్రయోగం వల్ల అతని భార్యకు అఖిల్(సూర్య), విమల్ (సూర్య) అవిభక్త కవలలు పుడతారు. అఖిల్ అభ్యుదయ భావాలు గల వ్యక్తయితే దానికి పూర్తి విరుద్ధంగా ఆటలు, పాటలు, పబ్ కల్చర్ ఇష్టపడతాడు విమల్. ఇద్దరూ అంజలి(కాజల్ అగర్వాల్)ని ప్రేమిస్తారు. కాగా, రామచంద్ర పిల్లలకు శక్తినిచ్చే 'ఎనర్జీన్' అనే పౌడర్‌ను తయారుచేసి క్రమేణా పెద్ద వ్యాపారవేత్తగా ఎదుగుతాడు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఓల్గా అనే జర్నలిస్టు పౌడర్ రహస్యాన్ని ఛేదించే క్రమంలో చనిపోతుంది.
ఆమె దాచిపెట్టిన పెన్‌డ్రైవ్‌లో రహస్యాలున్నాయని తెలుసుకున్న అఖిల్ దానిద్వారా అసలు దోషి తన తండ్రి రామచంద్రేనని తెలుసుకుంటాడు. ఇది తెలిసిన రామచంద్ర కొడుకునైనా సరే పరువుకోసం చంపేయమని దుండగుల్ని పురమాయిస్తాడు. ఆ పోరాటంలో అఖిల్ మెదడుకు గాయమై చనిపోతాడు. మిగిలింది విమల్. ఇంత గొడవ జరగడానికి కారణం నాన్నేనని తెలిసి అసలు మూలం ఎక్కడుందనేది తెలుసుకునేందుకు ఉక్రెయిన్ వెళతాడు. ఆ తర్వాత ఏమి జరిగింది? అనేది సినిమా.
పెర్‌ఫార్మెన్స్ కన్‌జాయింట్ బ్రదర్స్‌గా సూర్య పెర్‌ఫార్మెన్స్ అదుర్స్. ఇద్దరి వేరియేషన్స్ బాగా చూపించాడు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ గ్లామర్ క్వీన్‌గా అలరిస్తుంది. మేక వన్నె పులి పాత్రలో సచిన్ కదేకర్ కరెక్ట్‌గా సూటయ్యాడు. పలు చిత్రాల్లో పోలీసు ఆఫీసర్‌గా నటించిన రవిప్రకాష్ ఇందులో కన్నింగ్ విలన్‌గా నటించాడు. ఇక మిగిలిన పాత్రలన్నీ తమిళవాసనలే. వీరికితోడు ఉక్రెయిన్ క్యారెక్టర్లు కూడా ఉన్నాయి.
వివరణ కన్‌జాయింట్ ట్విన్స్ అనే కొత్త బ్యాక్‌డ్రాప్‌ను తీసుకుని దాన్నుంచి డ్రగ్ అనే మాఫియా ఏ స్థాయిలో ఉందనేది అంతర్జాతీయంగా దర్శకుడు నిరూపించాడు. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో ఉక్రెయిన్‌కు చెందిన 42మంది ఆటగాళ్లు పతకాలు సాధించడం వెనుక అసలు కారణంగా డ్రగ్ తీసుకోవడం అనే కొత్త కాన్సెప్ట్‌ను దర్శకుడు కె.వి. ఆనంద్ తెరపైకి తెచ్చాడు.
దేశాలు తమ పరువుప్రతిష్టల కోసం ఏవిధంగా ప్రాకులాడతాయి. దానివల్ల ఎంతమంది బలవుతున్నారనే అంశాన్ని తెరపైకి తెచ్చాడు. ఎనర్జీ పౌడర్ పేరుతో చిన్నపిల్లల జీవితాలతో ఆడుకుంటూ దేశ పౌరుల్ని నిర్వీర్యం చేసే వ్యక్తులు ఇండియాలో ఉన్నారని ముగింపు ఇచ్చాడు. ప్రపంచంలో మేథావులు అంతా ఇండియాలోనే ఉన్నారు. కానీ వారి ఇంటిలిజెంట్ అనేది దురాగతాలకు ఉపయోగపడుతుందనీ, దానివల్ల ఎలాంటి చావుకు గురవుతారనేది క్లైమాక్స్‌లో చక్కగా చూపాడు.
ఈ కాన్సెప్ట్ సూర్య నటించిన 'సెవెన్త్ సెన్స్'కు కొంచెం పోలికగా ఉన్నా... దానికి దీనికి చాలా వ్యత్యాసమూ కన్పిస్తుంది. ఎమోషన్స్ పండించడంలో దర్శకుడు తీసుకున్న శ్రద్ధ బాగుంది. ఆంథోనీ ఎడిటింగ్, సుందర రాజన్ కెమెరా పనితం బాగుంది. రామకృష్ణ తెలుగు సంభాషణలు బాగున్నాయి. సీరియస్ కాన్పెప్ట్ కావడంతో తెలుగువారికి ఎంటర్‌టైన్ చేయడానికి సెపరేట్ ట్రాక్ లాంటిది లేకపోవడంతో కాస్త నిరాశే మిగుల్తుంది.
మొదటిభాగంలో అన్నదమ్ములు చేసే విన్యాసాలు పీక్ వరకు తీసుకెళ్తాయి. స్క్రీన్‌ప్లేలో చక్కటి పట్టును సంపాదించి దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్‌లో మాత్రం దేశ సమస్య ఇంటర్‌నేషనల్ వరకు చేసి కామన్‌పీపుల్‌కు ఈజీగా అర్థంకాని పాయింట్ టచ్ చేశాడు. దీంతో కామన్ పీపుల్‌కు కాస్త అర్థంకావడానికి టైమ్ పడుతుంది. టోటల్‌గా చూస్తే ఇది ఇంటిలిజెంట్ తీసిన చిత్రమనిపిస్తుంది. అందరూ కలిసి చూడతగ్గ చిత్రమిది.