ధనుష్ - శృతి హాసన్ "3" కొలవెరి ఏంటి..?!!

సోమవారం, 2 ఏప్రియల్ 2012 (16:56 IST)
WD
కొలవెరి.. కొలవెరి..ఢీ..అంటూ ధనుష్‌ పాడిన విరహ వేదన పాట.. ఎంత ప్రాచుర్యం పొందిందో సినిమా విడుదల తర్వాత అంత ప్రాచుర్యం పొందలేకపోయింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మొదట నెగెటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. మూడు రోజులు సెలవులు కావడంతో కలెక్షన్లు ఫర్లేదనిపించాయి. ఐశ్వర్య దర్శకత్వం మెచ్చదగిందిగా ఉంది.

కథలోకి వెళితే...
శ్రీరామ్‌ (ధనుష్‌) వ్యాపారవేత్త ప్రభు కొడుకు. ఇంటర్‌ చదువుతుంటాడు. చదువులో చురుగ్గా ఉన్నట్లే అల్లరిలోనూ అంతే. ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన జనని (శృతిహసన్‌) వేరే చోట చదువుతుంటుంది. వర్షం పడిన ఓ పగలు.. సైకిల్‌ చైన్‌తో ఇబ్బంది పడుతుంటే.. సరి చేస్తాడు. అలా ఫస్ట్‌లుక్‌తో ఆమెను ప్రేమించేస్తాడు. ఆమె కోసం ట్యూషన్‌ కూడా చేరతాడు.

అలా దగ్గరయి ఆమె చేత ప్రేమించేలా చేస్తాడు. తన కుటుంబం విదేశాలకు వెళ్ళాలనుకున్న టైమ్‌లో జనని పాస్‌పోర్టు కూడా కాల్చేసి... తను రామ్‌తోనే ఉంటానని తెగేసి చెబుతుంది. దాంతో బయటకు వచ్చి రామ్‌ను పెండ్లి చేసుకుంటుంది. అయితే ఇరువైపులా తల్లిదండ్రులు మాత్రం పెండ్లికి రారు. ఇన్‌డైరెక్ట్‌ సపోర్ట్‌ వుంటుంది. పెండ్లయ్యాక కొంతకాలం సాఫీగా సాగుతుండగా..... తండ్రి చేసే వ్యాపారంలో కోట్ల నష్టం వచ్చిందని తెలుసుకున్న రామ్‌లో మార్పు కన్పిస్తుంది.

ఆ మార్పు మానసిక రోగి లక్షణంగా డాక్టర్లు తేలుస్తారు. ఈ వ్యాధి ఉన్నవారు ఎప్పుడూ ఆనందంగా ఉంటారో, ఎప్పుడు డిప్రెషన్‌కు గురవుతారో చెప్పలేమంటారు. ఆ వ్యాధి ఉన్నవారు ఎదురుగా తన స్నేహితుడు, ప్రియురాలు ఉన్నా చంపేయాలనంత కోపంతో బిహేవ్‌ చేస్తారు. అటువంటి వ్యక్తితో జనని కాపురం ఎలా సాగింది? అన్నది కథ.

ఈ చిత్రంలో హైలైట్‌.. దర్శకురాలిగా ఐశ్వర్య చేసిన ప్రయత్నం... మొదటి భాగం బాగా డీల్‌ చేసింది. ప్రేమించి పెండ్లి చేసుకున్న అనుభవంతోనో ఏమో.... ధనుష్‌, శృతిహాసన్‌ల ప్రేమ ట్రాక్‌ నేటి జనరేషన్‌కు తగినట్లుగా తీర్చిదిద్దింది. చిన్నచిన్న విషయాలను చాలా జాగ్రత్తగా డీల్‌ చేసింది. మొదటి రాత్రి విషయంలోనూ కళ్లకు కట్టినట్లు చూపించింది. సన్నివేశపరంగా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ అనిరుధ్‌ బాగా చేశాడు.

ధనుష్‌ కాలేజీ కుర్రాడి నుంచి గృహస్తు అయ్యేంతవరకు, ఆ తర్వాత వ్యాధిగ్రస్తుడుగా మూడు షేడ్స్‌ను బాగా పండించాడు. పక్కింటి కుర్రాడిలా కన్పిస్తాడు. శృతిహాసన్‌ అంతే. టీనేజ్‌లో ఉన్న ఆకర్షణ, దాని లోంచే పుట్టే భయం, బెరుకుదనం చక్కగా పోషించింది. రెండుమూడు సినిమాల్లో ఆమె చూపని నటన ఇందులో చూపించింది. ఇందుకు దర్శకురాలిని అభినందించాలి. ధనుష్‌ స్నేహితులు బాగానే నటించారు. ప్రభు, తులసి పాత్రల తల్లిదండ్రులుగా నటించారు. మిగిలిన పాత్రలు మామూలే.

సంభాషణలు బాగానే ఉన్నాయి. మొదటి భాగం చాలా సరదాగా సాగుతుంది. రెండో భాగంలోకి వచ్చేసరికి సాఫీగా పోతున్న రోడ్డుపై గతుల్లా.... హీరోకు వ్యాధి సోకడం.. సైకోగా మారడం వంటి విషయాలు ప్రేక్షకుడ్ని ఇబ్బంది పెట్టిస్తాయి. దాంతో ఈ చిత్రం మందకొడిగా సాగుతుంది. విషాదం, విరహం వంటి కోణాలు ఆవిష్కరించారు. దీంతో సినిమా ఏదో పాత సినిమా చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. క్లైమాక్స్‌లో హీరో చనిపోవడం అనేది తెలుగువారికి రుచించిక పోవచ్చు కానీ... తమిళులకు ఇవి మామూలే. నటీనటులు పెర్‌ఫార్మెన్స్‌ పరంగా సినిమా ఓకే... ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం చూసే వారికి ఇది నిరాశే మిగులుస్తుంది.

సెకండాఫ్‌లో వచ్చే 'కొలవరి కొలవరి పాట... వినడానికి బాగుంది.. సన్నివేశ పరంగా అంత ఎఫెక్ట్‌ అనిపించదు. ఎందుకంటే.... పెండ్లయి పుట్టింటికి వెళ్లిన జననిని మర్చిపోలేక విరహవేదనతో... అంటే ఇంకా తిరిగి రాదన్నట్లుగా.... పాడిన ఆ పాట సింక్‌ కాలేదు. మొత్తంగా ఏవరేజ్‌ సినిమా.

వెబ్దునియా పై చదవండి