"వాడు - వీడు" నటించలేదు... జీవించారు..!!!

శనివారం, 18 జూన్ 2011 (16:09 IST)
WD
నటీనటులు: విశాల్‌, ఆర్య, మధుశాలిని, జనని, జి.ఎం. కుమార్‌, ఆంబిక, ప్రభ, అతిథి పాత్రలో సూర్య తదితరులు; సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, నిర్మాత: విక్రమ్‌కృష్ణ, దర్శకత్వం: బాలా.

పాయింట్‌: రిమోట్‌ గ్రామంలోని దొంగలైన ఓ ఇద్దరు అన్నదమ్ముల కథ.

బాలా.. ఈ పేరు వినగానే తెలుగువారికి 'శివపుత్రుడు'తో పరిచయమైన దర్శకుడు గుర్తుకు వస్తాడు. విశాల్‌, ఆర్య కాంబినేషన్‌ థియేటర్‌కు రాబట్టేలా చేసింది. కథగా చెప్పాలంటే చిన్న పాయింటే. ప్రధానంగా స్క్రీన్‌ప్లే బేస్‌డ్‌ చిత్రం. రొటీన్‌ ఫార్ములా చిత్రాలకు భిన్నంగా ఉండే సినిమా ఇది.

కథలోకివెళితే....
పిఠాపురం అనే ఊరిలో వాల్టన్‌ (విశాల్‌), దండాల స్వామి (ఆర్య) ఒకే తండ్రి సంతానం. దొంగతనాలు చేసే కుటుంబం. తల్లులు వేరు. అంబిక, ప్రభ వారి తల్లులు. రక్తసంబంధమే అయినా ప్రతి చిన్న విషయానికి గొడవపడుతుంటారు. స్వామి దొంగతనాలు చేయడంలో దిట్ట. వాల్టర్‌ మంచి కళాకారుడు కావాలన్నది జీవితాశయం. ఏ పనిచేసినా కళాకారుడిగా చేసేస్తాడు. ఆ ఊరికి జమీందర్‌ హైసన్‌ (జి.ఎం.కుమార్‌). కళలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా వాల్టర్‌ను ప్రోత్సహిస్తుంటాడు. హైసన్‌ను అయినవాళ్ళు మోసం చేస్తే, ఉన్నదానిని పేదలకు పందేరం చేసి వారిలో ఒకడిగా ఉంటాడు.

గ్రామంలోని వారికి ఏ ఆపదా వచ్చినా ఆదుకుంటాడు. బేబి(జనని) ఊరిలో కానిస్టేబుల్‌. నాగు (మధుశాలినీ) డిగ్రీచదివే విద్యార్థిని. ఇద్దరూ చెరొకరిని ప్రేమిస్తారు. ఆ ఊరి అడవిని కేంద్రంగా చేసుకుని పశువులతో వ్యాపారం చేసే ఓ ముఠాను హైసన్‌ ఎదుర్కొంటాడు. దానికి ఫలితంగా హైసన్‌ను చంపేస్తారు. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరు ఏం చేశారు..? అన్నది సినిమా.

ఇది తమిళ చిత్రమైన 'అవన్‌ ఇవన్‌'కు డబ్బింగ్‌ సినిమా. కథలో చెప్పాల్సిన పాయింట్‌ చిన్నదే అయినా... దాన్ని నడిపిన నడక చాలా ఇంట్రస్ట్‌గా దర్శకుడు తెరకెక్కించాడు. పూర్తి మాస్‌ ప్రేక్షకుల్ని టార్గెట్‌ చేసుకుని తీసిన చిత్రమిది. కమేడియన్స్‌ లేకుండానే విశాల్‌, ఆర్య ఇద్దరూ చేసిన విన్యాసాలే నవ్విస్తాయి. యువన్‌ శంకర్‌రాజా బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంది.

శశాంక్‌ వెన్నెలకంటి సంభాషణలు స్ట్రెయిట్‌గా ఉంటాయి. పక్కామాస్‌ మాట్లాడుకునే భాషను యథాతథంగా ఇందులో రాశారు. అవి కొన్ని ఎబ్బెట్టుగా ఉన్నాయి. తల్లీకొడుకుల మధ్యసాగే సంభాషణల్లో మలవిసర్జన చేస్తే నువ్వు అట్టు వేసినట్లుగా పడుతుందే అంటూ... అవసరమైతే వాడికోసం పెంటకూడా తింటానని ఆర్య, విశాల్‌‌నుద్దేశించి మాట్లాడడం. మరీ మాస్‌ సంభాషణలు శృతిమించినట్లున్నాయి.

WD
పెర్‌ఫార్మెన్స్‌పరంగా విశాల్‌ క్లీప్‌స్వీప్‌ చేశాడు. అపరిచితుడులో విక్రమ్‌ చేసిన విన్యాసాలు విశాల్‌లో కన్పిస్తాయి. నపుంసకుడిగా ఆయన చేసిన డాన్స్‌ థియేటర్‌ దద్దరిల్లింది. ఆర్య ఓ సభకు అతిథిగా వచ్చినప్పుడు విశాల్‌ తన కళను బయటపెట్టే సందర్భంలో నవరసాలు పలికించే విధానం హైలైట్‌గా నిలిచింది. అసలు ఈ చిత్రం విశాల్‌ కోసమే తీసినట్లుంది. పైగా మెల్లకన్నుతో ఆద్యంతం కన్పించడం విశాల్‌ నటనా ప్రత్యేకం. ఆర్య పాత్రకూడా రఫ్‌గా ఉంటుంది. మిగిలిన పాత్రలన్నీ పాత్ర మేరకు నటించారు.

మొదటి భాగం హిలేరియస్‌ కామెడీగా సాగింది. రెండో భాగం కాస్త సెంటిమెంట్‌తో హృదయాన్ని టచ్‌ చేస్తుంది. కొన్ని సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులకు రుచించకపోవచ్చు.

1. తల్లీ కొడుకులు (ప్రభ, ఆర్య)లు మందుకొట్టి డాన్స్‌వేయడం.
2. మలవిసర్జనపై సాగిన సంభాషణలు
3. అడవిలో కోటిరూపాయల సరుకు లారీలో తీసుకెళ్ళిన విశాల్‌ దాన్ని ఏంచేశాడో చెప్పలేదు.
4. చదువుసంధ్యా లేనివారు, అమ్మాయిల్తో ఎలా బిహేవ్‌ చేయాలో తెలీని వారిని చదువుకున్న అమ్మాయిలు ప్రేమించడం.

ఇలా ఎన్ని లొసుగులున్నా... బాల తను చెప్పాల్సింది స్ట్రెయిట్‌గా చెప్పి.. స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నాడు. రొటీన్‌ సినిమాలు చూసేవారికి ఈ చిత్రం కాస్త రిలీఫ్‌. అయితే మాస్‌ను ఆకట్టుకున్నట్లు క్లాస్‌ను ఆకట్టుకోవడం కష్టమే. రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి